స్పీకర్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ!

స్పీకర్ తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ!
  • 29 నుంచి ప్రత్యక్ష విచారణ చేపట్టే అవకాశం

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్ శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​ తో భేటీ అయ్యారు. ఇందులో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందిలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు తమ వివరణలను స్పీకర్ కు అందజేయగా.. కడియం, దానం తమ వివరణలను  అందించలేదు. 

కడియం మాత్రం ఈ నెల 30లోపు వివరణ ఇస్తానని  చెప్పినట్టు తెల్సింది.  ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవలే బీఆర్ఎస్  ఎమ్మెల్యేలు లీగల్ ఫార్మెట్ లో ఆధారాలతో సహా అఫిడవిట్ ల రూపంలో స్పీకర్ కు అందజేశారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఇరు వర్గాల వాదనలు వినాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ నెల 29 నుంచి స్పీకర్ కార్యాలయంలోనే గడ్డం ప్రసాద్ ఇరు వర్గాలను ముఖాముఖి కూర్చోబెట్టి ఇద్దరి వాదనలను వినాలని నిర్ణయించుకున్నారు.