ఫైనల్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఎవరిదో?..ఇవాళ ముంబై, బెంగళూరు ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌

ఫైనల్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌ ఎవరిదో?..ఇవాళ ముంబై, బెంగళూరు ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌
  •     జోరుమీదున్న ఇరుజట్లు
  •     రా. 7.30 నుంచి స్పోర్ట్స్‌‌‌‌ 18, జియో సినిమాలో

న్యూఢిల్లీ : విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌)లో నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఎలిమినేటర్​లో డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ముంబై ఇండియన్స్‌‌‌‌.. రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుతో తలపడనుంది. ఇరుజట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆర్‌‌‌‌సీబీ గెలవడం ఆ జట్టుకు కాన్ఫిడెన్స్‌‌‌‌ పెంచే అంశం కాగా, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌ పరంగా రెండు జట్లు సమంగా ఉన్నా రికార్డుల పరంగా ముంబై ఆధిక్యంలో ఉంది. ఓవర్‌‌‌‌సీస్‌‌‌‌ ప్లేయర్లు ఫామ్‌‌‌‌లో ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం కాగా, ఆర్‌‌‌‌సీబీ ఎక్కువగా ఎలైస్‌‌‌‌ పెర్రీ మీద ఆధారపడటం బలహీన అంశం.

యాస్తికాకు చాన్స్‌‌‌‌!

ఈ మ్యాచ్‌‌‌‌ కోసం ముంబై పక్కా ప్లాన్‌‌‌‌తో బరిలోకి దిగుతోంది. ఆఖరి మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉన్న యంగ్‌‌‌‌ ఓపెనర్‌‌‌‌ యాస్తికా భాటియాను తుది జట్టులోకి తీసుకునే చాన్స్‌‌‌‌ ఉంది. గత7 మ్యాచ్‌‌‌‌ల్లో ఆమె 185 రన్స్‌‌‌‌ చేసింది. ఆర్‌‌‌‌సీబీతో మ్యాచ్‌‌‌‌కు దూరంగా ఉండటంతో సరైన విరామం కూడా లభించింది. దీంతో ఎలిమినేటర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో యాస్తికా కీలకం కానుంది. టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ హర్మన్‌‌‌‌, హేలీ మాథ్యూస్‌‌‌‌, సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. మిడిల్‌‌‌‌లో కెర్‌‌‌‌తో పాటు అమన్‌‌‌‌జోత్‌‌‌‌ భారీ హిట్టింగ్‌‌‌‌తో మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించొచ్చు. ఇక బౌలింగ్‌‌‌‌లో ముంబైకి తిరుగులేదు. ఆరంభంలో షాబ్నిమ్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌, మాథ్యూస్‌‌‌‌ బాల్‌‌‌‌తో ఎదురుదాడి చేయడంలో దిట్టలు. ఆ తర్వాత కెర్‌‌‌‌, పూజా, సైకా ఇషాక్‌‌‌‌ దాన్ని కొనసాగిస్తే ఆర్‌‌‌‌సీబీకి కష్టాలు తప్పవు. ఎక్కువ మంది ఆల్‌‌‌‌రౌండర్లు ఉండటం ముంబైకి కొండంత బలం. ఇక ఫీల్డింగ్‌‌‌‌లోనూ మెరిస్తే ఈజీగా బెంగళూరుకు చెక్‌‌‌‌ పెట్టొచ్చు. 

మంధానా, పెర్రీ కీలకం..

నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో ఒత్తిడిని జయించలేకపోవడం బెంగళూరుకు ఉన్న అతిపెద్ద మైనస్‌‌‌‌. లీగ్‌‌‌‌ దశలో నాలుగు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గిన ఆర్‌‌‌‌సీబీ నాలుగింటిలో ఓటమిని చవిచూసింది. ఇందులో కెప్టెన్‌‌‌‌ స్మృతి, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ ఎలైస్​ పెర్రీ బాగా ఆడిన ప్రతి మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచింది. ఈ ఇద్దరు ఫెయిలైన మ్యాచ్‌‌‌‌‌‌‌ల్లో ఓడింది. కాబట్టి ఎలిమినేటర్‌‌‌‌లోనూ ఈ ఇద్దరే కీలకం కానున్నారు. ఓపెనింగ్‌‌‌‌లో స్మృతి ఇచ్చే ఆరంభంపైనే స్కోరు బోర్డు ఆధారపడి ఉంటుంది. గత మ్యాచ్‌‌‌‌ను ఒంటిచేత్తో గెలిపించిన పెర్రీ ఫామ్‌‌‌‌లో ఉండటం ఆర్‌‌‌‌సీబీకి బలంగా మారనుంది. మొలినుక్స్‌‌‌‌, డివైన్‌‌‌‌, రిచా కూడా బ్యాట్లు ఝుళిపిస్తే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పవు. కీలక మ్యాచ్‌‌‌‌ కావడంతో తుది జట్టులో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు. జార్జియా వారెహామ్‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. బౌలింగ్‌‌‌‌లో రేణుకా సింగ్‌‌‌‌, మొలినుక్స్‌‌‌‌, డివైన్‌‌‌‌పైనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. స్పిన్నర్‌‌‌‌గా శ్రేయాంక పాటిల్‌‌‌‌ మెరిస్తే ఇబ్బందులు తప్పినట్లే. 

తుది జట్లు (అంచనా)

ముంబై : హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), హేలీ మాథ్యూస్‌‌‌‌, యాస్తికా భాటియా / సాజీవన్‌‌‌‌ సజన, సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌, అమెలియా కెర్‌‌‌‌, అమన్‌‌‌‌జోత్‌‌‌‌ కౌర్‌‌‌‌, పూజా వస్త్రాకర్‌‌‌‌, హుమైరా కాజీ, ప్రియాంకా బాలా, షాబ్నిమ్‌‌‌‌ ఇస్మాయిల్‌‌‌‌, సైకా ఇషాక్‌‌‌‌. 
బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌‌‌‌), సోఫియా మొలినుక్స్‌‌‌‌, ఎలైస్‌‌‌‌ పెర్రీ, సోఫీ డివైన్‌‌‌‌, రిచా ఘోష్‌‌‌‌, జార్జియా వారెహామ్‌‌‌‌, దిశా కసాట్‌‌‌‌, శ్రేయాంక పాటిల్‌‌‌‌, ఆషా శోభన, శ్రద్ధా పోకార్కర్‌‌‌‌, రేణుకా సింగ్‌‌‌‌.