గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా

గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా
  • డిపార్ట్​మెంట్ల నుంచి ఆలస్యంగా సమాచారం
  • ఇయ్యాల ప్రారంభం కావాల్సిన అప్లికేషన్ల స్వీకరణ లేనట్టే
  • 9,168 పోస్టుల భర్తీకి నవంబర్ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్ 
  • ఇండెంట్లు, రోస్టర్ రాక ముందే డిసెంబర్ 1న నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి పూర్తి స్థాయి సమాచారం రాకపోవడంతో టీఎస్ పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని  97 హెచ్ఓడీల పరిధిలో 9,168 పోస్టుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగిస్తూ నవంబర్ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీంట్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1862,  జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429 , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 ఉన్నాయి. అయితే తర్వాతి వారం రోజుల్లోపే డిసెంబర్ 1న టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఏప్రిల్/ మే నెలల్లో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్  వెల్లడించింది. అయితే 94 డిపార్ట్​మెంట్ల నుంచి వివరాలు సేకరించడం 22 రోజుల్లో సాధ్యం కాదని ‘ఉద్యోగాల భర్తీలో రూల్స్ పట్టని సర్కార్’ శీర్షికతో ఈనెల 12న ‘వెలుగు’ పత్రిక కథనం  ప్రచురించింది. డిపార్ట్​మెంట్ల నుంచి ఇండెంట్లు అందక ముందే, రోస్టర్ రాక ముందే ప్రభుత్వం టీఎస్ పీఎస్సీపై ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్లు ఇప్పించిందని కథనం పేర్కొంది. 

నాడు ‘వెలుగు’ చెప్పిందే  ప్రస్తుతం జరిగింది. పలు డిపార్ట్​మెంట్ల నుంచి ఇండెంట్లు క్లారిటీ లేకపోవడంతో టీఎస్​పీఎస్సీ అధికారులు తలలు పట్టుకున్నారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇంకో పక్క యూనివర్సిటీల్లోని ఖాళీలపై మరోసారి సమావేశం కావాలని టీఎస్ పీఎస్సీ భావిస్తోంది. అయితే రోస్టర్, పోస్టులపై క్లారిటీ రాకపోవడంతో శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్​4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించారు. అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి పోస్టుల వివరాలు వచ్చిన వాటిని టీఎస్పీఎస్సీ.. సీజీజీకి పంపించాల్సి ఉంటుంది. వాళ్లు కూడా టెస్టింగ్ కోసం మూడు రోజులు టైమ్ తీసుకునే అవకాశముంది. దీంతో ఈనెల 29 లేదా 30న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే అవకాశముందని టీఎస్​పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.