
రాష్ర్టంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో స్టూడెంట్లకు సీట్లను కేటాయించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బుధవారం ఉన్నత విద్యామండలి ఆఫీస్‌లో మండలి చైర్మన్ పాపిరెడ్డి, దోస్త్ కన్వీనర్ లింబాద్రితో కలిసి విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి దోస్త్ నోటిఫికేషన్‌ను,షెడ్యూల్‌ను విడుదల చేశారు. తొలివిడతలో ఈ నెల 23 నుంచి జూన్3 వరకు రూ.200తో స్టూడెంట్లు రిజిస్ర్టేషన్ చేసుకోవాలని, వారు ఈనెల 25 నుంచి జూన్3 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. రూ.400 ఫైన్‌తో జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఫస్ట్ విడతలో జూన్10న సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. జులై1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని, జులై 1 నుంచి 4 వరకు కాలేజీల్లో స్టూడెంట్లు సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని తెలిపారు. స్టూడెంట్ల సౌకర్యార్థం రాష్ట్రంలో 92 హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, దాంట్లో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తుల్లోని తప్పులను సరిచేసుకునేందుకు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో స్పెషల్ హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీనిలో ఐరిస్ పరికరాలను సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
ప్రైవేటులో రూ.500తో కన్ఫమ్ చేస్తే చాలు..
దోస్త్ పరిధిలో స్టేట్‌లో 1049 డిగ్రీ కాలేజీలు ఉన్నాయనీ దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వీటన్నిలో మెరిట్, రోస్టర్ ద్వారా సీట్లను కేటాయించనున్నట్టు చెప్పారు. దోస్త్ తో స్టేట్‌లోని ఏడు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు తిరిగే బాధ స్టూడెంట్లకు తప్పిందని, ఎక్కువ కాలేజీలు ఎంచుకునే అవకాశముందని పేర్కొన్నారు. గతంలో సీటు వస్తే ఆ కాలేజీకి వెళ్లి, రిపోర్టు చేయాల్సి ఉండేదని, కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో కన్ఫమ్ చేస్తే సరిపోతుందని చెప్పారు. స్కాలర్‌షిప్‌కు ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీల్లో పైసా చెల్లించకుండా చేరవచ్చని, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మాత్రం రూ.500లను ఆన్‌లైన్‌లో చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోవాలని తెలిపారు. స్కాలర్‌షిప్‌కు అర్హత లేని వారు ట్యూషన్‌ఫీజులో సగం చెల్లించి సీటు రిజర్వ్ చేసుకోవాలన్నారు. సీటు క్యాన్సిల్ చేసుకుంటే, చెల్లించిన మొత్తం తిరిగి స్టూడెంట్అకౌంట్లోకి వస్తుందన్నారు. మరిన్ని వివరాలను ‘దోస్త్’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు.
సర్టిఫికెట్లు ఆపితే చర్యలు..
ఇంటర్, డిగ్రీ ప్రైవేటు కాలేజీలున్న మేనేజ్మెంట్లు తమ కాలేజీల్లోనే చేరాలని స్టూడెంట్లను ఒత్తిడి చేస్తే చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపితే దోస్త్ నుంచి ఆ కాలేజీలను తొలగిస్తామని హెచ్చరించారు. స్టేట్‌లో 27 ప్రైవేటు, 20 మైనార్టీ కాలేజీలు దోస్త్ పరిధిలో లేవని చెప్పారు. ఇంటర్ రిజల్ట్స్‌ఆలస్యమైతే అవసరమైతే దోస్త్ షెడ్యూల్‌ను మారుస్తామని, వారికోసం ప్రత్యేకంగా మరో విడత అడ్మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఏ ఒక్క స్టూడెంట్‌కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. డిగ్రీ కోర్సులకు అన్ని యూనివర్సిటీల్లో కామన్‌ఫీజు చేయాలని, మేనేజ్మెంట్ కోటా సీట్లను కేటాయించాలని కాలేజీ యాజమాన్యాలు కోరుతున్నాయని, అయితే వీటిపై గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఎన్నికల కోడ్ తర్వాత విద్యాశాఖమంత్రితో దీనిపై చర్చిస్తామన్నారు.