
ఓయూ, వెలుగు: ఓయూ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు, పీహెచ్‌డీ ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. గురువారం ఉస్మానియా వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు ఎవరూ రాకపోవడంతో స్టూడెంట్లు బిల్డింగ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి ఓయూ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీ ఓయూ ప్రెసిడెంట్ అశోక్, సెక్రటరీ పరశురాం మాట్లాడుతూ ప్రైవేట్ వర్సిటీలను తలదన్నేలా ఉస్మానియా వర్సిటీ అధికారులు ట్యూషన్ ఫీజులు పెంచుతూ స్టూడెంట్లను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.
డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు విచ్చలవిడిగా పెంచుతున్నారని, రూ.2వేలు ఉన్న పీహెచ్ డీ ఫీజును రూ.20 వేలకు పెంచి పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు పరిశోధక విద్యను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కమల్ సురేష్, పృథ్వీ తేజ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పీహెచ్‌డీ కోర్స్ ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్కాలేజీ ఎదుట పాంప్లెంట్లను ఆవిష్కరించారు.