నిరుద్యోగి బిర్యానీ పాయింట్.. ఓ నిరుద్యోగి ఆలోచన

నిరుద్యోగి బిర్యానీ పాయింట్.. ఓ నిరుద్యోగి ఆలోచన

నిజామాబాద్:  రాష్ట్రంలో నిరుద్యోగులు విసిగి వేసారిపోతున్నారు. ఏళ్లకేళ్లు వేచి చూసినా... నోటిఫికేషన్లు రాక... ఒకవేళ వచ్చినా... సరిపడినన్ని పోస్టులు లేక... ఉద్యోగాలు అందని ద్రాక్షగా మారాయి. అనేక ఏళ్లు ప్రిపరేషన్ లోనే గడిపి... చివరికి ఉద్యోగాలు రాక... ఉపాధి కోసం వేర్వేరు దారులను వెతుక్కుంటున్నారు నిరుద్యోగులు. అలా విసిగిపోయిన ఓ నిరుద్యోగి కుటుంబపోషణ కోసం కొత్తగా ఆలోచించి.. సక్సెస్ అయ్యాడు.

నిజామాబాద్ కు చెందిన శివశంకర్ 2014లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత గత ఆరేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఒకసారి ఎగ్జామ్ రాసినా క్వాలిఫై కాలేదు. మళ్లీ ప్రిపరేషన్ మొదలుపెట్టి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడసాగాడు. అయితే నోటిఫికేషన్లు రాక... కుటుంబ పరిస్థితులు దిగజారడంతో... స్వయం ఉపాధి అవకాశాలు వెతుక్కున్నాడు. అలా ఏ పని చేయాలి అని ఆలోచిస్తూ.. ఆకలి అందరికీ ఉండేదే.. కాబట్టి దాన్నే తన వ్యాపారంగా మలుచుకోవాలనుకున్నాడు. వెంటనే నిరుద్యోగి బిర్యానీ పాయింట్ అని రోడ్ సైడ్ వ్యాపారం మొదలుపెట్టాడు. నిజామాబాద్ లోని రాజరాజేంద్ర చౌరస్తాలో తోపుడు బండిపై బిర్యానీ అమ్ముతున్నాడు. ఇంటి దగ్గర వండి తెచ్చి రాజరాజేంద్ర చౌరస్తాలో బిర్యానీ అమ్ముతున్నాడు. వెజ్ బిర్యానీ 30 రూపాయలు, ఎగ్ బిర్యానీ 40 రూపాయలకు అందిస్తున్నాడు. ఖర్చులు పోను రోజుకు 500 రూపాయల వరకు మిగులుతున్నాయని శివశంకర్ అంటున్నాడు. నిరుద్యోగి అనే పేరు చూసి చాలామంది వచ్చి తన దగ్గర భోజనం చేస్తున్నారని శివశంకర్ చెబుతున్నాడు.   

డిగ్రీ చదివిన కొడుకు.. ఉద్యోగం రాక బిర్యానీ పాయింట్ పెట్టుకోవడంతో తల్లిదండ్రులు కొంత బాధపడినా.. స్వయం ఉపాధి వెతుక్కోవడంతో ఆ బాధను మరిచిపోయారు. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లి పోషణ భారం శివశంకర్ పై పడింది. అలాగే సొంత ఇళ్లు లేకపోవడంతో... ఇంటి అద్దె కట్టాల్సిన పరిస్థితి ఉండటంతో.. శివశంకర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని శివశంకర్ తల్లిదండ్రులు చెబుతున్నారు.