నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తాయని ఆశించిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. తొలకరి వర్షాలు పడితే విత్తనాలు వేసుకుందామని ఎదురు చూస్తున్నారు. అయితే చినుకు జాడ లేకపోవడంతో ఈసారి పూర్తిస్థాయి వర్షాలు ఎప్పుడు ఉంటాయోనన్న టెన్షన్ నెలకొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు కదిలేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కూడా ఏమీ కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏం జరిగినా నైరుతి రుతుపవనాలు ముందుకు కదలడం, సౌత్ ఇండియా అంతటా విస్తరిస్తేనే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రుతుపవనాల రాక మాట అటుంచితే.. టెంపరేచర్లు సాధారణం కంటే పలు ప్రాంతాల్లో అయిదారు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వేడి, ఉక్కపోతలతో జనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటోంది. నైరుతి రుతుపవనాల ఆలస్యంతో జూన్ రెండో వారంలోనూ ఈ పరిస్థితి కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. మే 29న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఈ నెల 8 నాటికి తెలంగాణలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ మొదట వేసిన అంచనాలు తప్పాయి. మరో 2 రోజుల తర్వాత రావచ్చని తాజాగా అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి రుతుపవనాలు రావాలంటే ముందుగా కర్ణాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవాలి. కానీ ఇప్పుడు అక్కడ కూడా అంతగా వానలు పడడం లేదని, తెలంగాణలోనే అక్కడక్కడ చిరుజల్లులు, అసాధారణ ఎండలతో మిశ్రమ వాతావరణం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
