స్కూల్​ బుక్కుల ప్రింటింగ్ మొదలేకాలే 

స్కూల్​ బుక్కుల ప్రింటింగ్ మొదలేకాలే 
  • విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యం
  • ఏటా ఏప్రిల్ చివరికల్లా జిల్లాలకు పుస్తకాలు 

వచ్చే విద్యా సంవత్సరం స్కూల్​ బుక్స్ ప్రింటింగ్​ ఇంకా మొదలు కాలేదు. ఏటా ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లాలకు పుస్తకాలు చేరుతాయి. కానీ ఈసారి ఇంకా టెండర్లు కూడా పూర్తి కాలేదు.

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి (2022–2023) సంబంధించిన పుస్తకాలు సకాలంలో స్టూడెంట్లకు అందేలా కనిపించడం లేదు. స్కూళ్ల ప్రారంభం రోజే విద్యార్థులకు టెక్ట్స్​బుక్స్ అందించాల్సి ఉన్నా, అది సాధ్యమయ్యేలా లేదు. రాష్ట్రంలో అన్ని మేనేజ్మెంట్ల పరిధిలో ఉన్న 40,898 స్కూళ్లలో 60 లక్షలకు పైగా స్టూడెంట్లు చదువుతున్నారు. వీటిలో సర్కారు విద్యాసంస్థల్లో చదువుతున్న సుమారు 26 లక్షల మందికి ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్స్ వారే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగానే టెక్ట్స్​బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ విభాగం కసరత్తు చేస్తుంటుంది. కానీ ఈసారి ప్రింటింగ్ ప్రక్రియ మొత్తం ఆలస్యంగా కొనసాగుతోంది. ఏటా ఏప్రిల్ నెలాఖరు నాటికి జిల్లాలకు పుస్తకాలు చేరుతాయి. కానీ ఈసారి ఇంకా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఉచిత పుస్తకాలకు అవసరమైన పేపర్​టెండర్లు కొనసాగుతుండగా, సేల్స్ బుక్స్ టెండర్ల ప్రక్రియ మొదలే కాలేదు. డిసెంబర్, జనవరిలోనే ఈ ప్రక్రియ మొదలు కావాల్సి ఉన్నా.. ఉన్నతాధికారులు జీవో 317 హడావుడిలో పడి, పుస్తకాల ప్రింటింగ్ ను నిర్లక్ష్యం చేశారు. 

2.10 కోట్ల ఫ్రీ బుక్స్ కావాలె... 
రాష్ట్రంలో ఫస్ట్ నుంచి టెన్త్ క్లాసు వరకు 195 టైటిల్ బుక్స్ ఉన్నాయి. వచ్చే ఏడాదికి ఫ్రీ బుక్స్ 2.10 కోట్లు, సేల్స్​బుక్స్ 1.28 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వీటి ప్రింటింగ్ ప్రక్రియ ఈ నెలాఖరుకు ప్రారంభమైనా, అది పూర్తవ్వడానికి కనీసం నెలన్నర నుంచి రెండు నెలలు పట్టొచ్చు. తర్వాత పుస్తకాలు జిల్లాలకు, అక్కడి నుంచి స్కూళ్లకు చేరడానికి మరో నెల పడ్తది. అంటే జూన్​ రెండో వారంలో స్కూళ్లు ప్రారంభమయ్యే టైమ్​కు పుస్తకాలు ప్రింటింగ్​దశలోనే ఉండే అవకాశముంది.