
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెంగుళూరు..ఢిల్లీ బౌలర్ల ధాటికి కేవలం 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది.
ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లే కోల్పోయి 223 పరుగులు చేసింది. ఢిల్లీ ఆరంభం నుంచి సిక్సులు, ఫోర్లతో చెలరేగింది. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ పోటీ పడి మరీ ఆడారు. తొలి వికెట్ కు ఏకంగా 162 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇదే క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరు వెంట వెంటనే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మరిజన్నే కప్, రోడ్రిగేజ్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. మూడో వికెట్ కు అజేయంగా 60 పరుగులు జోడించడంతో ఢిల్లీ భారీ స్కోరు నమోదు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో హేతర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టింది.
వరుసగా వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ
224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ..ఇన్నింగ్స్ను ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లు స్మృతీ మంథాన, సోఫీ డివైన్ తొలి వికెట్కు 41 పరుగులు జోడించారు. అయితే14 పరుగులు చేసిన సోఫీ తొలి వికెట్గా నిష్క్రమించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే స్మృతీ కూడా వెనుదిరిగింది. అక్కడి నుంచి బెంగుళూరు వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసి ఓడిపోయింది. హేటర్ నైట్ 34 పరుగులు, మేగన్ షట్ 30 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో తారా నోర్రీస్ 5 వికెట్లు పడగొట్టగా...అలైస్ కాప్సీ 2 వికెట్లు, షికా పాండేకు ఒక వికెట్ దక్కింది.