IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి

IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి

ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విశాఖపట్నంను తమ సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఢిల్లీ తమ మొదటి భాగం హోమ్ మ్యాచ్ లను వైజాగ్ లో ఆడనుంది. రిషబ్ పంత్, యష్ ధుల్, ఇషాంత్ శర్మ వంటి స్టార్స్‌తో సహా జట్టు సభ్యులు ఇప్పటికే వచ్చి YSR ACA-VDCA స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగూలీ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కనబడి తెలుగు క్రికెటర్లను ఖుషీ చేశారు. 

ఫ్రాంచైజీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా గంగూలీ రాకను ప్రకటించింది. టీమ్ హోటల్‌కు చేరుకున్న భారత దిగ్గజ క్రికెటర్‌కు ఘనస్వాగతం లభించి సిబ్బంది సన్మానించారు. గంగూలీ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక చిహ్నం అయిన టైగర్ మాస్క్‌తో పోజులిచ్చాడు. ఈ నగరం రెండు హై-వోల్టేజ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.  మార్చి 31న చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ ఈ మైదానంలో తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. టిక్కెట్ విక్రయాలపై అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో పంజాబ్ కింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది . బెంగళూరులో నీటి ఎద్దడి కారణంగా మరిన్ని మ్యాచ్‌లను విశాఖపట్నంకు తరలించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ఐపీఎల్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కెప్టెన్ రిషబ్ పంత్ రాకతో  ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పటిష్టంగా కనిపిస్తుంది. 2023 సీజన్ లో వార్నర్ కెప్టెన్సీలో దారుణంగా విఫలమైన క్యాపిటల్స్.. ఈ సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేస్తుందనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.