IPL 2025: రూ.9 కోట్లు దండగే: ఇండియాకు తిరిగిరాని ఆసీస్ క్రికెటర్.. రీప్లేస్ మెంట్‌గా ఢిల్లీ జట్టులో యార్కర్ల వీరుడు

IPL 2025: రూ.9 కోట్లు దండగే: ఇండియాకు తిరిగిరాని ఆసీస్ క్రికెటర్.. రీప్లేస్ మెంట్‌గా ఢిల్లీ జట్టులో యార్కర్ల వీరుడు

ఐపీఎల్ 2025 రీ స్టార్ట్ కు ముందు ఢిల్లీ జట్టు కీలక రీప్లేస్ మెంట్ ప్రకటించింది. ఈ సీజన్ లోని మిగిలిన మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ దూరమయ్యాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం (మే 14) బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ స్థానంలో జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. మెక్‌గుర్క్ ఈ సీజన్‌లో మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు అందుబాటులో ఉండదని తెలిపింది. రూ. 6 కోట్లకు ముస్తాఫిజుర్ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు.  

22 ఏళ్ల జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 2024 ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టాడు. ఓపెనర్ గా వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ కారణంగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ చిచ్చర పిడుగుని రూ. 9 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అయితే ఈ సీజన్ లో మాత్రమే ఈ యువ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్ ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతను ప్లేయింగ్ 11 లో చోటు కోల్పోయాడు. మెక్‌గుర్క్ లేకపోయినా ఢిల్లీ విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదు అని తెలుస్తోంది. భారత్, పాక్ ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిన మెక్‌గుర్క్ ఇండియాకు రిటర్న్ రావడం లేదు.    

ముస్తాఫిజుర్ రెహమాన్‌ కు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రెహమాన్, గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. 2022, 2023లో ఢిల్లీ జట్టుకు ఆడాడు. యార్కర్లతో పాటు డెత్ ఓవర్లు వేయడంలో ముస్తాఫిజుర్ స్పెషలిస్ట్. రూ. 2 కోట్లతో ఐపీఎల్ మెగా ఆక్షన్ లోకి వచ్చినా అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.