ఢిల్లీ దుమ్మురేపుతుందా ? పంజాబ్ పంజా విసిరేనా ?

ఢిల్లీ దుమ్మురేపుతుందా ? పంజాబ్ పంజా విసిరేనా ?
  • ఢిల్లీ దుమ్మురేపుతుందా ?

  • పంజాబ్ పంజా విసిరేనా ?

  • ఢిల్లీ Vs పంజాబ్ .. గెలిచేదెవరు ?

  • ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య ఏది గెలుస్తుంది 

 

ఐపీఎల్ లో ప్లేఆఫ్ పోటీ హాట్ హాట్ గా సాగుతోంది. ఇప్పటికే మాజీ ఛాంపియన్లు చెన్నై, ముంబై ఫ్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా, గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్ లో అడుగు పెట్టిన మొదటి జట్టుగా నిలిచింది.  మిగతా మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ (సోమవారం ) రాత్రి పంజాబ్, ఢిల్లీ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే 12 మ్యాచులు ఆడిన రెండు జట్లు ..చెరో ఆరు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆరు మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. దీంతో 12 పాయింట్లతో ఢిల్లీ 5వ స్థానంలో, 12 పాయింట్లతో పంజాబ్ 7వ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గేమ్ ఢిల్లీ, పంజాబ్ జట్లకు డు ఆర్ డై అని చెప్పొచ్చు.


బెంగుళూరుపై గెలుపుతో పంజాబ్ మళ్లీ ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సత్తా చాటి 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.  దీంతో ఢిల్లీతో జరిగే మ్యాచ్ లోనూ అదే జట్టుతో పంజాబ్ బరిలోకి దిగొచ్చు. ఓపెనింగ్ లో బెయిర్ స్టో, శిఖర ధావన్ ఆడటం ఖాయం. పరుగుల పరంగా ధావన్ పర్వాలేదనిపిస్తుండగా, బెయిర్ స్టో దుమ్మెురేపుతున్నాడు. గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్ లోనూ బెయిర్ స్టో రాణిస్తే పంజాబ్ కు పరుగుల వరదే. మిడిలార్డర్ లో బానుక రాజపక్స విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్ లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లివింగ్ స్టోన్ తనదైన శైలిలో ఆడుతూ మిడిల్ ఆర్డర్ లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఈ మ్యాచ్ లోనూ అతను మరోసారి చెలరేగొచ్చు. అటు ఓపెనింగ్ నుంచి మిడిల్ కు మారిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్.. పెద్దగా రాణించడం లేదు. లోయర్ ఆర్డర్ లో జితేష్ శర్మ ఫాంలో ఉండగా, రిషి ధావన్, హర్ప్రీత్ బ్రార్  బ్యాట్ ఝుళిపించాల్సి ఉంది. బౌలింగ్ లో రబాడా, హర్షదీప్ సింగ్, రాహల్ చాహర్ ఆడనున్నారు. రబాడా గత మ్యాచ్ లో చెలరేగడం జట్టుకు శుభపరిణామం.  అతనితో పాటు హర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ వికెట్లతో పాటు ఎకానమీని కంట్రోల్ చేయడం ప్లస్ పాయింట్.

ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ ను వార్నర్, పృథ్వీ షా ఓపెన్ చేయనున్నారు. వార్నర్ భీకర ఫాంలో ఉండటం జట్టుకు సానుకూలాంశం. అటు టైఫాయిడ్ తో  గత మ్యాచుల్లో ఆడని పృథ్వీ షా  తిరిగి ఆడనుండటంతో ఢిల్లీ బ్యాటింగ్ కు మరింత బలపడింది.  వీరిద్దరు రెచ్చిపోతే మాత్రం పంజాబ్ బౌలర్లు చుక్కలే. మిడిలార్డర్ లో  మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ ఇద్దరు సూపర్ ఫాంలో ఉండటం ఢిల్లీకి ప్లస్ పాయంట్. అయితే లలిత్ యాదవ్ వైఫల్యం జట్టును కలవరపెడుతోంది. ఈ మ్యాచ్ లో అయినా అతను రాణిస్తాడో లేదో చూడాలి. లోయర్ ఆర్డర్ లో పావెల్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండే ఛాన్సుంది. హైదరాబాద్ తో గేమ్ లో పావెల్ రాణించినా, ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. శార్దూల్ మోస్తారుగా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ అన్న ట్యాగ్ కు న్యాయం చేయలేకపోతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ లో తమ లోపాలను సవరించుకుని ఈ ముగ్గురు బ్యాట్ తో రాణించాలని యాజమాన్యం కోరుకుంటుంది. బౌలింగ్ లైనప్  లో కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, చేతన్ సకారియా ఉంటారు. కుల్దీప్ యాదవ్ ఆరంభంలో రాణించినా, ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. నోర్ట్జే మాత్రమే వికెట్లు తీసుకుంటున్నాడు. చేతన్ సకారియా కూడా స్థాయికి తగ్గట్లు రాణిస్తున్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ ను కట్టడి చేయాలంటే కుల్దీప్ రాణించాల్సిందే. 

ఇప్పటి వరకు రెండు జట్లు 29 మ్యాచుల్లో తలపడితే పంజాబ్ 15, ఢిల్లీ 14 మ్యాచుల్లో గెలిచాయి. ఈ సీజన్ లో రెండు జట్లు ఒక సారి తలపడితే అందులో ఢిల్లీనే గెలిచింది. 

ఈ మ్యాచ్ రాత్రి 7 గంట 30 నిమిషాలకు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్ పిచ్, అలాగే స్పిన్ కు సహకరిస్తుంది. ఇక్కడ 16 మ్యాచులు జరిగితే అందులో 9 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా, 7 సార్లు రెండో సారి బ్యాటింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.