CSK vs DC: సొంతగడ్డపై చెన్నై చిత్తు.. ఢిల్లీకి వరుసగా మూడో విజయం

CSK vs DC: సొంతగడ్డపై చెన్నై చిత్తు.. ఢిల్లీకి వరుసగా మూడో విజయం

ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఘోరంగా ఓడింది. శనివారం (ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 25 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ లో రాహుల్ (77) కు తోడు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్లకు 158 పరుగులకు పరిమితమైంది.        

184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ఈ టోర్నీలో పేలవ ఫామ్ కొనసాగిస్తూ 3 పరుగులకే ఔటయ్యాడు. వెంటనే మిచెల్ స్టార్క్ ఒక షార్ట్ బాల్ తో కెప్టెన్ గైక్వాడ్ (5) ను పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే కాన్వే 13 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నై 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దూబే సిక్సర్, ఫోర్ కొట్టి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లినా భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. 

►ALSO READ | PBKS vs RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. రాజస్థాన్ జట్టులో ఒక మార్పు

 జడేజా రాగానే కుల్దీప్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు చేరాడు. దీంతో చెన్నై 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ ఓటమి అంచుల్లో పడింది. ఒక ఎండ్ లో విజయ్ శంకర్ (69) క్రీజ్ లో సెటిల్ అయినా భారీ షాట్స్ ఆడలేకపోయాడు. కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ధోనీ (32)  కూడా ఏమీ చేయలీకపోయాడు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ ముకేశ్ కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు.   

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో దుమ్ము రేపింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 77:6 ఫోర్లు, 3 సిక్సర్లు) తనదైన క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అభిషేక్ పోరెల్ (33), సమీర్ రిజ్వి (21), స్టబ్స్ (24), అక్షర్ పటేల్ (22) తలో చేయి వేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీ స్కోర్ చేసింది.