నేను విచారణకు వచ్చేదే లేదు ..తెగేసి చెప్పిన కేజ్రీవాల్

నేను విచారణకు వచ్చేదే లేదు ..తెగేసి చెప్పిన కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు.   ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు తాను  హాజరుకావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి.

పార్టీ అధినేత కేజ్రీవాల్ ఈడీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారం చేయకుండా నిరోధించడానికి అతన్ని అరెస్టు చేయాలనే ఉద్దేశ్యంతో నోటీసు పంపారని, ఇది చట్టవిరుద్ధమని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ కేసులో   జనవరి 3న ఈడీ ముందు విచారణకు అటెండ్ కావాలని  2023 డిసెంబర్ 22న సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మూడోసారి సమన్లు ​​జారీ చేసింది. ఇవాళ కేజ్రీవాల్ విచారణకు హాజరుకావాల్సి ఉండగా..హాజరుకాలేరని పార్టీ వర్గాలు ప్రకటించాయి. 

ఢిల్లీ లిక్కర్ కేసులో  కేజ్రీవాల్ ను మొదటి సారి 2023  ఏప్రిల్ లో సీబీఐ 9 గంటల పాటు విచారించింది. ఈ కేసులో 2023  నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ నోటీసులు పంపింది. అయితే అప్పట్లో మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఉందని హాజరు కాలేదు. దీంతో డిసెంబర్ 21న హాజరుకావాలని మళ్లీ  ఈడీ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 20న కేజ్రీవాల్ విపాసన కార్యక్రమానికి వెళ్లారని విచారణకు  హాజరుకాలేరని తెలిపాయి. దీంతో  కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం ఇది మూడోసారి.