లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు వెనుక ఏం జరిగింది

లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు వెనుక ఏం జరిగింది

లిక్కర్  స్కామ్  కేసులో ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్​ను ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి భారీ భద్రతా బలగాల మధ్య 12 మంది ఈడీ అధికారులు సీఎం ఇంటికి చేరుకున్నారు. సెర్చ్  వారంట్  చూపించి ఆయనను కొంతసేపు ప్రశ్నించారు. అనంతరం ఆయనను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. శుక్రవారం కేజ్రీవాల్​ను కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం కస్టడీలోకి తీసుకుంటామని ఈడీ అధికారులు తెలిపారు. అంతకుముందు కేజ్రీవాల్  ఫోన్లతో పాటు ఆయన భార్య ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు ట్యాబ్స్​, ఒక ల్యాప్ టాప్  నుంచి డేటాను ట్రాన్స్ ఫర్  చేసుకున్నారు. 

లిక్కర్  కేసు పూర్వాపరాలు

2021 నవంబర్ 7: సీఎం అర్వింద్  కేజ్రీవాల్  నేతృత్వంలో ఆప్  ప్రభుత్వం కొత్త లిక్కర్  పాలసీని అమలు చేసింది.
2022 జులై 8: ఈ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వ చీఫ్​  సెక్రట రీ నరేష్​ కుమార్ అప్పటి ఎల్జీ వీకే సక్సేనాకు ఫిర్యాదు చేశారు.
2022 జులై 22: సీఎస్  ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు వీకే సక్సేనా సిఫారసు చేశారు.
2022 జులై 31: కొత్త విధానాన్ని ఆప్  సర్కారు ఉపసంహరించుకుంది.
2022 ఆగస్ట్ 17: 15 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది.
2022 ఆగస్ట్ 19: మనీష్​ సిసోడియా, మరో ముగ్గురి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీ చేశారు.
2022 ఆగస్ట్ 22: లిక్కర్  పాలసీపై ఈడీ మనీ లాండరింగ్  కేసు నమోదు చేసింది.
2022 సెప్టెంబర్: ఆప్  కమ్యూనికేషన్ల చీఫ్​ విజయ్  నాయర్​ను సీబీఐ అరెస్టు చేసింది.
2023 మార్చి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్​  సిసోడియాను ఈడీ అరెస్టు చేసింది.
2023 అక్టోబర్: ఆప్  లీడర్  సంజయ్  సింగ్​ను కూడా ఈడీ అరెస్ట చేసింది.
2023 అక్టోబర్: కేజ్రీవాల్ కు ఈడీ రెండుసార్లు సమన్లు పంపింది.
2024 మార్చి 16: బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది.
2024 మార్చి 21: తాజాగా కేజ్రీవాల్​ను కూడా ఈడీ అరెస్టు చేసింది.

కేజ్రీవాల్  టైమ్  అయిపోయింది: కేంద్రం

 కేజ్రీవాల్​ కావాలనే విచారణకు డుమ్మా కొడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున అడిషనల్  సొలిసిటర్  జనరల్ ఎస్వీ రాజు అన్నారు. కేంద్రం తరపున ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ తొమ్మిదిసార్లు సమన్లు పంపిందని, ఆయన టైమ్  అయిపోయిందని రాజు  పేర్కొన్నారు. ఈడీ సమన్లు చట్టవ్యతిరేకం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.