లిక్కర్​ స్కామ్​లో కవిత పాత్రపై ఈడీ చార్జ్​షీట్

లిక్కర్​ స్కామ్​లో కవిత పాత్రపై ఈడీ చార్జ్​షీట్
  • మరో నలుగురి పాత్రపై కూడా..!

న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై ఈడీ చార్జ్​షీట్​ను దాఖలు చేసింది. ఆమెతోపాటు సహ నిందితులుగా ఉన్న మరో నలుగురి పాత్రను కూడా ఇందులో మెన్షన్ చేసింది. శుక్రవారం ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టులో ఈడీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్​.కె.మట్ట చార్జ్​షీట్​ను దాఖలు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్, సెక్షన్ 45, 44(1) ప్రకారం ఈ అనుబంధ చార్జ్ షీట్​ను  కోర్టులో సమర్పించారు. కాగా, ఈ నెల 7న కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ సందర్భంగా.. త్వరలో కవిత పాత్రపై చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు ఈడీ అడ్వకేట్లు కోర్టుకు తెలిపారు. అందులో భాగంగా చార్జ్ షీటును శుక్రవారం సమర్పించారు. వచ్చే వారం ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై కూడా ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

6‌‌0 రోజుల్లో చార్జ్ షీట్

గరిష్టంగా ఏడేండ్ల జైలు శిక్ష పడే చాన్స్​ ఉన్న కేసుల్లోనే నిందితులను అరెస్ట్ చేసిన 60 రోజుల్లో చార్జ్ షీటు దాఖలు చేయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మనీలాండరింగ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్  చేసింది. ఈ నెల 15తో అరెస్ట్ చేసి 60 రోజులు పూర్తవుతాయి. దీంతో గడువులోపు ఆమె పాత్రపై చార్జ్ షీటు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో మే 20 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ట్రయల్ కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. 

18 మందిని అరెస్ట్ చేసి 7 చార్జ్ షీట్లు వేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో కవిత, సీఎం కేజ్రీవాల్, ఆప్​ నేతలు మనీశ్​ సిసోడియా, సంజయ్ సింగ్​తో పాటు మొత్తం 18 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సంజయ్ సింగ్ ఒక్కరికి మాత్రమే ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి 2022 నవంబర్ 25న సీబీఐ తొలి చార్జ్ షీట్ దాఖలు చేయగా.. తర్వాతి రోజు ఈడీ చార్జ్ షీటు వేసింది. ప్రస్తుతం కవితతో పాటు, మరో నలుగురి పేర్లను చేర్చుతూ 7 చార్జ్ షీట్లను కోర్జుకు సమర్పించింది. సౌత్ గ్రూప్​లో కీలకంగా వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్, ఆయన కుమారుడు రాఘవరెడ్డి అప్రూవర్లుగా మారడంతో వాళ్లకూ బెయిల్ వచ్చింది. కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్న అభిషేక్ బోయినపల్లి అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్​పై బయటకు వచ్చారు.