- తల్లి తిట్టిందని ఇంట్లోంచి బయటకొచ్చిన యూపీ మైనర్
- నోయిడా సెక్టార్ 63లోని తమ బంధువు ఇంటికి జర్నీ
- రాత్రి 9 గంటలకు పొరపాటున పరి చౌక్ వద్ద దిగిన బాలిక
- బాలికను నమ్మించి బస్సు ఎక్కించుకున్న డ్రైవర్, కండక్టర్
- 45 నిమిషాల పాటు బస్సును రోడ్డుపై తిప్పుతూ ఆమెపై అత్యాచారం
- ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద బాధితురాలిని దించేసి, బెదిరింపులు
- బాలిక ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆగస్టు 4వ తేదీ రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఓ బాలిక(16 )పై కండక్టర్, డ్రైవర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన బాలిక..ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది. చదువు విషయంలో తల్లి తిట్టడంతో కోపంతో ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చింది.
నోయిడా సెక్టార్ 63లో ఉంటున్న తమ బంధువుల దగ్గరికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. అయితే.. వర్షం కురుస్తుండటం, బాగా చీకటిగా ఉండటంతో రాత్రి 9 గంటలకు ఆమె పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయింది. అప్పటికి ఆమె తన బంధువు ఇంటికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షంలో తడుస్తూనే ఒంటరిగా నిలబడి నోయిడా సెక్టార్ 63కి వెళ్లేందుకు బస్సు కోసం వెయిట్ చేసింది. అప్పుడే విశ్వనాథ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన ఖాళీ స్లీపర్ బస్సు ఆమె దగ్గర ఆగింది. బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండెక్టర్ సందీప్ (26) బాలిక దగ్గరకు వెళ్లి తాము కూడా నోయిడా సెక్టార్ 63 వైపే వెళుతున్నామని, తమతో పాటు వస్తే అక్కడ దించుతామని నమ్మబలికి బస్సెక్కించారు.
ఎవరికైనా చెబితే చంపేస్తం
బస్సు కదలిన కొద్దిసేపటికే కండక్టర్ సందీప్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత డ్రైవర్ కుల్దీప్ కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా 45 నిమిషాల పాటు బస్సును రోడ్డుపై తిప్పుతూ నిందితులు అఘాయత్యానికి పాల్పడారు. అనంతరం బస్సును నోయిడా సెక్టార్ 93 గుండా దాదాపు 43 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద బాలికను దింపేశారు.
విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన బాలిక.. కాశ్మీర్ గేట్ నుంచి వెంటనే ఒక ఆటోలో సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనమీద జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన జరిగిన రోజే (ఆగస్టు 4న) ఢిల్లీలోని తిమార్‌పూర్ పార్కింగ్ ప్లేస్ లో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఈ ఇద్దరూ విశ్వనాథ్ ట్రావెల్స్ సంస్థలో రెండేళ్లకు పైగా పనిచేస్తున్నట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. నిందితులకు ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంతో పాటు వారి నేపథ్యాన్ని ట్రావెల్ కంపెనీ సరిగ్గా పరిశీలించిందో లేదో అనే పోలీసులు కూపీ లాగుతున్నారు.
దర్యాప్తు వేగవంతం
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు కీలక కోణాలను పరిశీలిస్తున్నారు. వాస్తవానికి బస్సు సాధారణ ప్రయాణికుల సర్వీస్ కాదని.. టెక్నికల్ లోపం కారణంగా గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్‌లోని ఒక వర్క్‌షాప్‌నకు తీసుకెళ్లారని నిర్ధారించారు. మరమ్మతుల తర్వాత సాయంత్రం 5 గంటలకు బయటకు తీసుకువచ్చారని.. రాత్రి 9 గంటలకు ప్రయాణం ప్రారంభించిన ఆ బస్సులో ప్రయాణికులు లేరని తేల్చారు.
బస్సు లోపల స్లీపర్ బెర్త్‌లకు కర్టెన్లు ఉండటం వల్ల నిందితులు బయటి వారికి కనిపించకుండా సులభంగా నేరానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి, లోపల నుంచి బాలిక జుట్టు తంతువుల (స్ట్రాండ్స్)సేకరించింది. బస్సు పోలీసు పోస్ట్‌లు, బారికేడ్ల నిఘా, సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రధాన రహదారుల గుండా 43 కిలోమీటర్ల దూరం ప్రయాణించినా ఎక్కడా తనిఖీలు గురికాకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బస్సు వెళ్లిన మార్గం మొత్తన్ని సమీక్షిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు రాత్రే సమాచారం అందించి ఢిల్లీకి పిలిపించిన పోలీసులు.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి ఆమెను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.కాగా.. ఈ ఉదంతం 2012 నాటి నిర్భయ కేసును తలపించడంతో మహిళా భద్రత మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది.
