- చీరకట్టుతో, చెప్పుల్లేకుండా పరుగెత్తిన రామబాయ్ రన్వీర్
బీడ్ (మహారాష్ట్ర): కూతురి చదువు కోసం ఒక తల్లి పడిన తపన అసాధారణ విజయానికి దారితీసింది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబజోగైకి చెందిన 47 ఏండ్ల రామబాయ్ రన్వీర్.. ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ అమృతోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘అమృత్ దౌడ్’ మారథాన్‌లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారు.
స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద ప్రారంభమై భగత్‌నగర్ చౌక్ వరకు సాగిన ఈ పరుగు పందెంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు స్పోర్ట్స్ షూస్, ట్రాక్ సూట్లతో బరిలో దిగారు. అయితే, సాధారణ చీర, చెప్పులతో వచ్చిన రామబాయ్ విజేతగా నిలుస్తారని ఎవరూ ఊహించలేదు. పరుగు మొదలైన కొద్దిసేపటికే ఆమె చెప్పులు జారడంతో వేగం తగ్గింది. అయినా ఆమె నిరుత్సాహపడకుండా, ఆ చెప్పులను చేతిలో పట్టుకుని పరుగు కొనసాగించారు.
రోడ్డుపై రాళ్లు, ముళ్లు లెక్కచేయకుండా, చీరను సర్దుకుంటూ పరుగెత్తారు. మారథాన్‌కు తగ్గ ఆధునిక డ్రెస్సింగ్‌తో వచ్చిన ఎంతోమంది యువతీయువకులను వెనక్కి నెట్టి అందరికంటే ముందుగాఫినిషింగ్ లైన్ తాకారు. ఈ విజయంతో ఆమెకు రూ.3,000 నగదు బహుమతి
లభించింది. ఈ ప్రైజ్ మనీని తన కూతురి చదువు కోసమే ఖర్చుచేస్తానని ఆమె తెలిపారు.
