ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం(ఫిబ్రవరి 16) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనిపై జస్టిస్ ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈడని ఆదేశించాలని ఆమె పిటిషన్‌లో కోరారు. అలాగే, ఈడీ కార్యాలయ సందర్శనలకు బదులు మహిళను ఇంటి వద్దే విచారించాలని కవిత సుప్రీంకోర్టును అభ్యర్థించనున్నట్లు సమాచారం.

అయితే, కవిత పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గతేడాది సెప్టెంబరులో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇంతలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రావడంతో ఈ కేసులో ఈడీ వెనక్కు తగ్గింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు.. కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇచ్చారు. అయితే, ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం అందించారు.  ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని ఈ మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారమిచ్చారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది మార్చి 11, 20, 21 తేదీల్లో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఆ సమయంలో ఆమె గతంలో తాను ఉపయోగించిన సెల్‌ఫోన్లను అధికారులకు అప్పగించారు.