- ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్ర, శనివారాల్లో మద్యం దుకాణాలు బంద్కానున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేపడుతున్న నిరసనలు, శనివారం జంతర్ మంతర్ వద్ద జరగనున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (సీజీపీ) ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 9, 10తేదీల్లో ఎల్6, ఎల్6ఎఫ్‌జీ, ఎల్8, ఎల్10, ఎల్14 తదితర లైసెన్సుల కింద నిర్వహిస్తున్న రిటైల్ మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. కాగా, ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు పొందిన హోటళ్లు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. వాటికి ఈ ఆంక్షలు వర్తించవని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు శనివారం జరిగే నిరసనకు ఢిల్లీ వ్యాప్తంగా 20 వేల మందికి పైగా పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని మోహరించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నిరసనకు అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. అనుమతి లేని సమావేశాలు, ఆందోళనల్లో పాల్గొనకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
