దేశంలోనే మొదటిసారి.. ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌: కేజ్రీవాల్‌

దేశంలోనే మొదటిసారి.. ఢిల్లీలో ప్లాస్మా బ్యాంక్‌: కేజ్రీవాల్‌
  • రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తామన్న సీఎం
  • అందరూ ప్లాస్మా డొనేట్‌ చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నందున ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కరోనా పేషంట్లకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ చేసేందుకు వీలుగా ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రెండ్రోజుల్లో దానికి సంబంధించి బ్యాంక్‌ ఓపెన్‌ చేస్తామని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం ప్రకటించారు. కరోనాను జయించిన వారు ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వారి కోసం ప్లాస్మా దానం చేయాలని కోరారు. “ ప్రజల ప్రాణాలను కాపాడే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అందుకే కరోనా నుంచి రికవరి అయిన ప్రతి ఒకరు ప్లాస్మా దానం చేయాలని నేను కోరుతున్నాను” అని అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 29 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. వాళ్లంతా రికవర్‌‌ అయ్యారని అన్నారు. ప్లాస్మా బ్యాంక్‌ పెట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌‌ అండ్‌ బిలియరీ సైన్స్‌ (ఐఎల్‌బీఎస్‌) హాస్పిటల్‌లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్‌, ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చేరే పేషంట్లకు ఇది అందుబాటులో ఉంటుందని అన్నారు. ఐఎల్‌బీఎస్‌ హాస్పిటల్‌లో కరోనా పేషంట్లకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వనందున డోనర్లు సేఫ్‌గా అక్కడికి వచ్చి ప్లాస్మా డొనేట్‌ చేయొచ్చని కేజ్రీవాల్‌ అన్నారు. కరోనా సోకిన వ్యక్తి పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే ఈ ప్లాస్మా థెరపీ ఉపయోగిస్తారు. కరోనా వచ్చి తగ్గిపోయిన వ్యక్తి బ్లడ్‌ ప్లాస్మాను సేకరించి దాన్ని పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి ఎక్కిస్తారు. ఆ ప్లాస్మాలో ఉన్న యాంటీబాడీస్‌ ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బూస్ట్‌ చేస్తుంది.