ఢిల్లీ టూ హైదరాబాద్​ డ్రగ్స్ సప్లయ్

ఢిల్లీ టూ హైదరాబాద్​ డ్రగ్స్ సప్లయ్
  • రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ అమ్మిన కీలక నిందితులు అరెస్ట్
  • మీడియా వివరాలు వెల్లడించిన మాదాపూర్​జోన్ డీసీపీ వినీత్

గచ్చిబౌలి, వెలుగు: రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో ఇద్దరు కీలక నిందితులను సైబరాబాద్​పోలీసులు అరెస్ట్​చేశారు. వారి వద్ద రూ. కోటి విలువైన11 గ్రాముల ఎండీఎంఏ, 7 సెల్​ఫోన్లు,  ఒక జాగ్వార్​కారును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీస్​లో మాదాపూర్​జోన్ డీసీపీ వినీత్​మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్​కు చెందిన సయ్యద్​అబ్దుల్​రెహ్మన్​(27) ఈజీ మనీ కోసం డ్రగ్స్​అమ్ముతున్నాడు. గోవాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ అరెస్టై జైలులో ఉన్న ఫైజల్, మరికొందరితో కలిసి హైదరాబాద్, బెంగళూరు, గోవా తదితర ప్రాంతాల్లో పబ్ లకు వచ్చే కస్టమర్లకు డ్రగ్స్​అమ్ముతూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు. 

అబ్దుల్​రెహ్మన్ ఢిల్లీ నుంచి కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్​ను తీసుకొచ్చి సిటీలో పబ్​లకు వచ్చే వారికి అమ్ముతున్నాడు. ఇతనిపై ఇప్పటికే 6 కేసులు ఫైల్ నమోదు అవగా.. తప్పించుకొని తిరుగుతుండగా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలి రాడిసన్​హోటల్​లో జరిగిన డ్రగ్స్​పార్టీలో పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులను పోలీసులు అరెస్ట్​ చేయడం సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్​కేసు దర్యాప్తులో భాగంగా ఓల్డ్ సిటీకి చెందిన మీర్జా వహీద్​బేగ్​వద్ద డ్రగ్స్ కొన్నట్టు గుర్తించి అతడిని అరెస్ట్​ చేశారు. 

అతడికి అబ్దుల్​రెహ్మన్ డ్రగ్స్​అమ్మినట్లు తేలింది. దీంతో గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్​ఎస్ఓటీ పోలీసులు అబ్దుల్​రెహ్మన్ కోసం గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. అతడికి సహకరించే  ఢిల్లీలోని మహిపాల్​పురాకు చెందిన మిలాన్​సి. నరేంద్ర సీవనత్​(27)ను కూడా అరెస్ట్ చేశారు. వీరు పబ్ ల్లో అధిక ధరకు డ్రగ్స్​అమ్మి వచ్చిన డబ్బుతో ఖరీదైన కార్లు, సెల్​ఫోన్లు కొనుగోలు చేసి జల్సాలు చేసేవారని మాదాపూర్​జోన్ డీసీపీ వినీత్​వివరించారు.