ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

 

  • అత్యంత పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియాగా బెగుసరాయ్​
  •     ఐక్యూఎయిర్ నివేదికలో వెల్లడి
  •     పీఎం2.5 కాలుష్యంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి సమస్యలు
  •     ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం వల్లేనని వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరితమైన రాజధానిగా ఢిల్లీ మరోసారి చెత్త రికార్డును మూటకట్టుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలుష్యభరితమైన మెట్రోపాలిటన్ ప్రాంతం బిహార్​లోని బెగుసరాయ్ అని 2023 వరల్డ్ ఎయిర్​ క్వాలిటీ రిపోర్టు వెల్లడించింది.  స్విట్జర్లాండ్​కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ తాజాగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేసింది. కాగా, 2018 నుంచి ఏటా విడుదల చేసే రిపోర్టులలో ఢిల్లీ నాలుగు సార్లు మొదటి ప్లేస్​లో ఉంది.

దేశంలో 96% మందిపై కాలుష్య ప్రభావం

గాలి నాణ్యతకు ప్రమాణంగా తీసుకునే పీఎం2.5 ధూళి కణాలు క్యూబిక్ మీటరుకు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ అత్యంత కాలుష్యపూరితమైన దేశాల లిస్ట్​లో టాప్​లో ఉంది. 73.7 మైక్రోగ్రాములతో పాక్​ రెండో స్థానం, 54.4 మైక్రోగ్రాములతో ఇండియా మూడో స్థానంలో ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే క్యూబిక్ మీటరుకు 118.9 మైక్రోగ్రాముల పీఎం2.5 ధూళితో బెగుసరాయ్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఉంది. ఢిల్లీ సిటీ పీఎం2.5 స్థాయిలు క్యూబిక్​ మీటర్​కు 92.7 మైక్రోగ్రాములుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌ఓ) అంచనాల ప్రకారం ఇండియాలోని 1.36 బిలియన్ల మందిపై పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతున్నది. దేశంలో 96% మంది డబ్ల్యూహెచ్​వో డేంజర్​గా నిర్దేషించిన స్థాయికంటే ఏడురెట్లు ఎక్కువ పీఎం2.5 కాలుష్యం కలిగిన గాలి పీల్చుతున్నారు.

తీవ్రమవుతున్న అనారోగ్య సమస్యలు 

ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనా సంస్థలు, 30 వేలకు పైగా రెగ్యులేటరీ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్​ల నుంచి సేకరించిన డాటాతో ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు ఐక్యూఎయిర్ తెలిపింది. అలాగే 134 దేశాల్లోని 7,812 ప్రాంతాల నుంచి సేకరించిన డాటా విశ్లేషించినట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి తొమ్మిది మరణాల్లో ఒకటి గాలి కాలుష్యం వల్లే సంభవిస్తున్నదని తెలిపింది. పీఎం2.5 వాయు కాలుష్యం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి సంబంధింత సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. అలాగే ప్రజల్లో ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్స్, ఊపిరితిత్తుల వ్యాధులు సహా అనేక అనారోగ్యాలు కలుగుతున్నాయిని తెలిపింది.