నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ కదలిక మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 హామీ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్యను ప్రత్యేకంగా పెంచాలనే ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై పెరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. కేంద్రం కూడా దేశవ్యాప్త పునర్విభజన ప్రక్రియను 2029 ఎన్నికల్లోపే పూర్తి చేసి, నియోజకవర్గాల కొత్త సంఖ్య, కొత్త స్వరూపాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు కథనం.
ఏది జరిగినా.. వచ్చే ఎన్నికలనాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. పునర్విభజనను మహిళా రిజర్వేషన్ల అంశంతో జతచేసి, ఇటీవలి పార్లమెంటు ప్రత్యేక భేటీలో ప్రవేశపెట్టినపుడు, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేక సదరు ప్రతిపాదన వీగిపోయింది! ఈ ప్రక్రియ 2026లోనే పూర్తిచేయాల్సి ఉన్నా తాజా జనాభా లెక్కలు, సంఖ్య పెంపుతో ముడిపడటం, ఏకాభిప్రాయం కుదరకపోవడం ప్రతిబంధకంగా మారింది. ఇపుడు కేంద్ర స్వీయ ఆసక్తి ఒకవైపు, ఏపీ ఒత్తిడి మరొకవైపు 2029లోపే పునర్విభజన సాకారం కావొచ్చు!
నియోజకవర్గాల భౌతిక స్వరూపం చివరిసారి పదిహేడేళ్ల కింద (2009లో) మారింది. ఈ దేశవ్యాప్త ప్రక్రియతో నిమిత్తం లేకుండానే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినపుడు ఏపీలో, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవచ్చనే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టం (సెక్షన్ 26, 27)లో పొందుపరిచారు. ఈ పెంపుదల ఎప్పుడో చేసుకొని ఉండాల్సింది. కానీ, ఒక సాంకేతికాంశం కారణంగా జాప్యమౌతూ వచ్చింది. 2021 జనాభా లెక్కల ఆధారంగా ఈ పునర్విభజన జరగాలని చట్టంలో పేర్కొన్నారు.
స్వాతంత్య్రానంతరం ప్రతి పదేళ్లకోసారి జరుగుతున్న జనాభా లెక్కల ప్రక్రియ కొవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగలేదు. ప్రతి పదేళ్లకోసారి జరిగే ఈ సైకిల్‌ను దశాబ్ది తొలియేడు (2001, 2011, 2021 లాగా) కాకుండా ఇకపై దశాబ్ది మధ్యలో (2025, 2035, 2045...) ఉండేట్టు 2025లో జరపాలని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఈ సంవత్సరమే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. 2027 మార్చి మాసాంతానికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు సభ ముందుకు తెచ్చినపుడు, తాజా జనాభా గణాంకాల కోసం నిరీక్షించకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వర్తింపజేయాలని అందులో ప్రతిపాదించారు. ఆ మేరకు రాజ్యాంగ సవరణకు సన్నద్ధమయ్యారు. కానీ, ఏకాభిప్రాయం కుదరక ఆ బిల్లు సభ ఆమోదం పొందలేదు. అందుకే, దీంతో నిమిత్తం లేకుండా ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వెంటనే చేపట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.
ఆమోదానికి కొత్త ఫార్ములా యోచన
జనాభా ప్రాతిపధికన దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెంచితే.. ఇన్నేళ్లు సమర్థంగా ‘కుటుంబ నియంత్రణ’ అమలుచేసి, జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయనేది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారి ఆందోళన. కు.ని పాటించకుండా జనాభా వృద్ధికి కారణమైన బిహార్, ఎంపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ (జనాభా వల్ల) స్థానాలు పెరిగి, అధిక ప్రాతినిధ్యంతో ఆధిక్యత పొందు తాయనేది విమర్శ. ఇక దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయంగా ఆధారపడనవసరం లేకుండా ఉత్తరాది ఆధిపత్యంతోనే బీజేపీ, ఎన్డీయే నిరవధికంగా అధికారం నిలుపుకుంటాయని కాంగ్రెస్‌తో సహా పలు ఇండియా కూటమి పార్టీలు విమర్శించాయి. ఇదే మొన్నటి ప్రతిష్టంభనకు కారణం.
దీంతో కేంద్రంలోని బీజేపీ నాయకత్వం 50 శాతం ఫార్ములాను ముందుకు తెచ్చింది. ప్రాతినిధ్యం అంశంలోనే అభ్యంతరాలుంటే జనాభా ప్రకారం కాకుండా అందరికీ, ఏకరీతిన 50శాతం పెంచేవిధంగా బిల్లు ముసాయిదాను గంటలో మార్చి తెప్పిస్తాం అని కూడా ప్రత్యేక భేటీ చర్చ సందర్భంగా పాలకపక్షం తెలిపింది. విపక్షాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బిల్లు వీగింది. దక్షిణాది రాష్ట్రాలు గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నాయని, 50 శాతం పెంపుదలకు అంగీకరించి ఉండాల్సిందని తెలుగు రాష్ట్రాల్లోని జయప్రకాశ్ నారాయణ (లోక్‌సత్తా)తో సహా పలువురు మేధావులు విపక్షాలని తప్పు
బట్టారు.
‘ఉన్నంతలో ఈ 50 శాతం ఫార్ములా బాగుంది, జనాభా ప్రాతిపదికన పెంచితే మరింత అన్యాయం జరుగుతుంది’ అన్నది వారి ఆలోచన. మహిళా బిల్లుతో ముడిపెట్టకుండా, విడిగానే పునర్విభజనపై అందరికీ ఆమోదయోగ్యమయ్యే కొత్త ఫార్ములాతో ముందుకు రావాలని కేంద్రం యోచిస్తోంది. బిల్లు ముసాయిదా తెచ్చే ముందే డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ వంటి పార్టీల నేతలతో మాట్లాడే సయోధ్యకు కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది
తాజా లెక్కలూ తీసుకోవచ్చు!
2029 సార్వత్రిక ఎన్నికల్లోపే నియోజకవర్గాల పునర్విభజనకు తాజా జనాభా లెక్కల్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. నియోజకవర్గాల సంఖ్య పెంపునకు 50 శాతం ఫార్ములా, వాటి భౌతిక స్వరూపం ఖరారుకు తాజా జనాభా లెక్కల్ని ప్రాతిపదిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సత్వరమే రెండు తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన (ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం-14 ప్రకారం) ప్రత్యేకంగా జరిపించాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.
చట్ట నిబంధన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఏపీ, తెలంగాణలో పునర్విభజన జరపకుండా జమ్మూ కాశ్మీర్‌లో జరిపించారని, ఈ వివక్ష ఏమిటని ప్రశ్నిస్తూ ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తమ్‌రెడ్డి తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగం 370 ఆర్టికల్ రద్దు చేస్తూ, రాష్ట్ర హోదా నుంచి కేంద్రపాలిత ప్రాంత హోదా తగ్గించారు. అక్కడ నియోజకవర్గాల ప్రత్యేక పునర్విభజనకు అనుమతించిన దరిమిలా చోటుచేసుకున్న ప్రక్రియతో 83 స్థానాలు 90కి పెరిగాయి. ఇక్కడ ఎందుకు అనుమతించరన్న కేసు విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనలు సమగ్రంగా విని సర్వోన్నత
న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసింది.
ఏపీ పునర్విభజన చట్టం-14లోని సెక్షన్ 26ను స్వతహాగా అమలుపరచజాలమని, ఇది భారత రాజ్యాంగం 170 అధికరణానికి లోబడే ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. 2026 తర్వాత అందుబాటులోకి వచ్చే తాజా జనాభా లెక్కలతోనే పునర్విభజన జరగాలని అందులో ఉంది. ఇప్పుడు ఆ లెక్కలు వచ్చే మార్చి మాసాంతానికి అందుబాటులోకి వస్తాయి గనుక, విడిగానైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన జరిపించాలనేది తాజా డిమాండ్! మొత్తం వర్తించేసినా, విడిగా తెలుగు రాష్ట్రాల్లో పునర్విభజన ప్రక్రియ చేపట్టినా నియోజకవర్గాల సంఖ్య పెరగటం ఖాయం!
మా వరకైనా చేయండి
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలోగాని బయట మరెక్కడైనా కేంద్ర ప్రభుత్వ, బీజేపీ అగ్రనేతలు కలిసినపుడు అదే పనిగా పునర్విభజన అంశాన్ని వారితో ప్రస్తావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఆయన ఎప్పుడు కలిసినా ఈ విషయమే వారి దృష్టికి తెచ్చి తమ వినతిగా పేర్కొంటున్నారు. కేంద్రాన్ని పట్టుబట్టి విడిగానయినా ‘పునర్విభజన’ జరిపించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు.
ఎన్డీయే కీలక భాగస్వామిగా ఉండి, ఏపీలో ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దమనిషిగా ఆయన మాటకు ఆదరణ లభించవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారమైతే అక్కడ ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలకి మరో 50 కొత్తగా పెరిగి మొత్తం 225 స్థానాలు అవుతాయి. అదే లెక్కన తెలంగాణలో ప్రస్తుత 119 స్థానాలకి మరో 34 పెరిగి మొత్తం 153 అవుతాయి. ఏ కారణం చేతయినా 2029 ఎన్నికల్లోపు జాతీయ స్థాయి పునిర్వభజన జరగని పక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జరిపిస్తే తమకు ప్రయోజనమని పైవారికి నచ్చచెబుతున్నారు. ఏపీకి జరిగినపుడు తెలంగాణలోనూ జరుగుతుందన్నది ఇక్కడివారి ఆశ! రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 శాతం ఫార్ములాతో ఏపీలో ఇప్పుడున్న 175 అసెంబ్లీ స్థానాలు 262/263 నియోజకవర్గాలవుతాయి. తెలంగాణలో ప్రస్తుత సంఖ్య 119కి బదులు 178/179 స్థానాలకు పెరగవచ్చు.
-దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
