ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నం చేయలే.. అదంతా వట్టిదే

ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యాయత్నం చేయలే..  అదంతా వట్టిదే
  • సూసైడ్ నోట్‌‌‌‌ క్షుణ్నంగా పరిశీలన
  • ఆత్మహత్యాయత్నం చేశాడనే వార్తలతో కలకలం
  • అదంతా వట్టిదేనని తేల్చిన పోలీసులు.. సూసైడ్ నోట్‌‌‌‌ క్షుణ్నంగా పరిశీలన
  • అకాడమీ నుంచి సస్పెండ్​ చేసిన ఉన్నతాధికారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ అధికారినిపై లైంగిక వేధింపుల కేసు కీలక మలుపుతిరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి రాసినట్టు చెప్తున్న సూసైడ్ లెటర్‌‌‌‌ బయటకు రావడం‌‌‌‌, ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించాడనే వార్తలు సోమవారం కలకలం రేపాయి.

 అపస్మారక స్థితిలో ఉన్న ఉదయ్‌‌‌‌ను కుటుంబ సభ్యులు ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అంతకుముందు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేస్తున్న ఆరోపణలపై ఉదయ్‌‌‌‌ వాట్సాప్‌‌‌‌ ద్వారా స్పందించారు. తన తప్పేమీ లేదని, కుట్రపూరితంగా అసత్య  ప్రచారం చేస్తున్నారని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సూసైడ్ నోట్ పేరిట రెండు పేజీల లెటర్‌‌‌‌‌‌‌‌ బయటకు వచ్చింది. 

కాగా,  దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిది ఆత్మహత్యాయత్నం కాదని అత్తాపూర్ పోలీసులు తేల్చారు. తనపై లైంగిక వేధింపుల కేసు నమోదుకావడం, అకాడమీ నుంచి సస్పెండ్ చేయడంతో కలత చెంది పెద్దమొత్తంలో లిక్కర్ తీసుకొని మత్తులోకి జారుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 

అకాడమీ నుంచి సస్పెన్షన్, కేసు..

తనను ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి లైంగికంగా వేధించినట్టు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 8, 9వ తేదీల్లో తన జుట్టుపట్టుకొని  రూమ్‌‌‌‌కు ఈడ్చుకువెళ్లాడని, గొంతుపై కత్తి పెట్టి కదలకుండా చేశాడని, కండోమ్‌‌‌‌ ప్యాకెట్లు మీదికి విసిరివేడయంతోపాటు గొంతు నులిమి చంపే యత్నం చేశాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. 

ఆమె ఫిర్యాదు మేరకు పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులతో  కూడిన ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే అంతర్గత విచారణ జరిపింది. సీసీ టీవీ ఫుటేజీలతోపాటు పలువురి స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా మహిళా ఐపీఎస్ ట్రైనీ చేసిన ఆరోపణలు నిజమేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. 

అటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడంతో ఉదయ్​కృష్ణారెడ్డిని అకాడమీ ఉన్నతాధికారులు సస్పెండ్‌‌‌‌ చేసినట్టు సమాచారం. ఇటు సస్పెన్షన్, అటు కేసు నమోదు, పోలీసుల నోటీసుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఉదయ్​ ఆదివారం నుంచి పెద్దమొత్తంలో లిక్కర్ తాగి, మత్తులోకి జారుకున్నట్టు భావిస్తున్నారు.   

సూసైడ్ నోట్‌‌‌‌ను పరిశీలిస్తున్న పోలీసులు..

మరోవైపు ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి పేరిట బయటపడ్డ సూసైడ్ నోట్‌‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్ ఆయనే రాశారా? ఇంకా ఎవరైనా రాశారా? రాస్తే ఎప్పుడు రాశారు? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఉదయ్ కృష్ణారెడ్డి చేతి రాతను పరిశీలిస్తున్నారు. కాగా, బాధితురాలితో తనకు గతేడాది జూన్‌‌‌‌ నుంచి రిలేషన్ షిప్ ఉందని ఉదయ్‌‌‌‌ తన లెటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు. 

ఆమెకు పెళ్లయ్యాక కూడా పలుమార్లు కలిసినట్టు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్, వీడియో రికార్డింగ్‌‌‌‌లు ఉన్నట్టు వెల్లడించాడు. ఈ నెల 9న ఆమె తన రూమ్‌‌‌‌కు వచ్చిందని,  తన ప్రమేయం లేకుండానే అసభ్యంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. 

ఆమె ప్రవర్తన అంతా మొబైల్ ఫోన్‌‌‌‌లో రికార్డ్‌‌‌‌ చేసి.. ఆమె భర్తకు పంపించినట్టు లెటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు. మహిళా ట్రైనీతోపాటు ఆమె భర్త, మరో ఇద్దరు తనను బెదిరించారని ఉదయ్​కృష్ణారెడ్డి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన ఐ ఫోన్‌‌‌‌లో ఉన్నాయని లెటర్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నాడు.

బంగారు బాటలు వేసుకొని.. ఇప్పుడు అంధకారంలోకి 

ఏపీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ  మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్‌‌‌‌ కృష్ణారెడ్డి  చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి, నానమ్మ దగ్గరే కష్టపడి చదువుకున్నాడు. 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2019 వరకు కానిస్టేబుల్‌‌‌‌గా విధులు నిర్వహించాడు. పోలీస్ స్టేషన్‌‌‌‌లో సీఐ తన తోటి సిబ్బంది ముందు తనను ఘోరంగా అవమానించడంతో ఏడేండ్ల సర్వీస్ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 

ఆ తర్వాత కష్టపడి చదివి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ అయ్యాడు. 350 ర్యాంకుతో ఐపీఎస్​ సాధించి, 2024 బ్యాచ్‌‌‌‌లో భాగంగా హైదరాబాద్‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ శిక్షణ పొందుతున్నాడు. అదే అకాడమీలో ట్రైనింగ్‌‌‌‌ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్‌‌‌‌ పట్ల అనుచిత ప్రవర్తించాడని ఫిర్యాదు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం అంధకారంలోకి వెళ్లిపోయింది.