దవాఖానాకు వెళ్తుంటే పొంగిన వాగు..దారిలోనే డెలివరి..

దవాఖానాకు వెళ్తుంటే పొంగిన వాగు..దారిలోనే డెలివరి..
  • ఎడ్లబండిపై వాగు దాటించిన కుటుంబసభ్యులు
  • మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి
  • కుమ్రం భీమ్‌‌‌‌ జిల్లాలో ఘటన

కాగజ్‌‌‌‌నగర్, వెలుగుప్రసవవేదన పడుతున్న గర్భిణిని హాస్పిటల్‌‌‌‌ తీసుకెళ్తుంటే జోరు వానలకు వాగు ఉప్పొంగింది. పురిటి నొప్పులు, మరోవైపు వాగు దాటి వెళ్లలేని పరిస్థితులతో ఆమె నరకయాతన పడింది. గ్రామస్తులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అందరూ కలిసి ఎడ్లబండిపై ఆమెను వాగు దాటించారు. జీపులో తరలిస్తుండగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుమ్రం భీమ్‌‌‌‌ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని గ్రామంలో చోటు చేసుకుంది. కొండ్ర వెంకటేశ్‌‌‌‌ భార్య కొండ్ర శంకరమ్మ(ఇందు)మొదటి సారి గర్భం దాల్చింది. ఆమెకు తొమ్మిది నెలలు నిండాయి. మంగళవారం మధ్యాహ్నం పురుటినొప్పులు వచ్చాయి. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జూర్ మండల కేంద్రంలోని పీహెచ్‌‌‌‌సీకి వెళ్లాలి. అయితే సోమిని గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుస్మీర్ వాగు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగింది. వంతెన లేకపోవడంతో రాకపోకలు సాగించలేని పరిస్థితి. అప్పటికే మాట్లాడిపెట్టిన జీపు వచ్చి అవతలి ఒడ్డున వెయిట్‌‌‌‌ చేస్తోంది. గర్భినిని వాగు వరకు తీసుకొచ్చారు. ఎలా దాటాలో తెలియక.. వేదన పడుతున్న ఆమెను ఓదార్చలేక కుటుంబ సభ్యులు సతమతమయ్యారు. చివరకు గ్రామస్తుల సాయంతో అతికష్టం మీద ఎడ్లబండిలో ఆమెను వాగు దాటించారు. అప్పటికే అక్కడున్న జీపులో హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దవాఖానాకు వెళ్లిన తరువాత పరీక్షించిన డాక్టర్లు తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. \