ఆంధ్రా లిక్కర్ కంపెనీల అగ్రిమెంట్​ను రద్దు చేయాలి

ఆంధ్రా లిక్కర్ కంపెనీల అగ్రిమెంట్​ను రద్దు చేయాలి
  • వైన్స్, బార్ లను 50 శాతం గౌడ్​లకు కేటాయించాలి
  • తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : తెలంగాణలో 17 లిక్కర్ కంపెనీలు ఆంధ్ర వాళ్ల చేతిలో ఉన్నాయని వెంటనే వారి అగ్రిమెంట్లను రద్దు చేయాలని తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది.  వైన్స్‌‌‌‌, బార్​లు 50 శాతం  గౌడ్​లకు కేటాయించాలన్నారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో నేతలు సోమవారం గాంధీభవన్​లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు.  అనంతరం బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ..  50 ఏండ్లు దాటిన గీత కార్మికులకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు.

కల్లుగీత కార్పొరేషన్​కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణించిన గీత వృత్తిదారులకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలన్నారు.  జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలని కోరారు. శ్రీధర్ బాబును కలిసిన వారిలో సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఆయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ ఉన్నారు.