ప్రమాద బీమా పెంచాలని డిమాండ్​

ప్రమాద బీమా పెంచాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధిలో ఎంతో కీలకమైన భవన నిర్మాణ కార్మికుల సమస్యలను టీఆర్​ఎస్​ సర్కార్​ పట్టించుకోవడం లేదని, వెంటనే వాళ్ల డిమాండ్లను నెరవేర్చాలని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తన ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ కమిటీ కలిసి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు కన్​స్ట్రక్షన్​​ టైంలో చనిపోతే వారికి ఇచ్చే ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గాయపడితే రూ.5లక్షల బీమా వర్తించేలా చేయడంతో పాటు కార్మికుడు కోలుకునే దాకా నెలకు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలన్నారు. కార్మికుల పిల్లలకు కార్పొరేట్​ స్కూల్స్​లో 5శాతం రిజర్వేషన్​ వర్తింపజేయాలని కోరారు. విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్​షిప్​లు అందజేయాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనతో కలిపించి సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేస్తానని రేవంత్ హామీ ఇచ్చారు.

తుంగతుర్తి టీఆర్​ఎస్​ నుంచి చేరికలు

తుంగతుర్తి నియోజక వర్గంలోని నూతనకల్, తాళ్ల సింగారం, ఎడవెల్లి, మిరియాల గ్రామాల నుంచి 50 మంది టీఆర్​ఎస్​ నేతలు కాంగ్రెస్​లో చేరారు. రేవంత్ ఇంటి వద్ద ఆయన సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్​ఎస్​కు కాలం దగ్గర పడిందని, వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని  రేవంత్​ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

గాంధీభవన్​లో బతుకమ్మ వేడుకలు

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్​ నేతృత్వంలో గాంధీభవన్​లో బుధవారం బతుకమ్మ వేడుకలు జరిగాయి. వేడుకలకు ఎమ్మెల్యే సీతక్క చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. మహిళా కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.