అసెంబ్లీలో బీసీలెక్కడ.. మళ్లీ తెరపైకి బీసీ నినాదం

అసెంబ్లీలో బీసీలెక్కడ.. మళ్లీ తెరపైకి బీసీ నినాదం
  • ఏండ్లుగా అన్యాయం జరుగుతున్నదని ఆయా వర్గాల్లో అసంతృప్తి
  • వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వాలని అన్ని పార్టీల్లోనూ డిమాండ్లు 
  • 52 శాతమున్న బీసీలకు అసెంబ్లీలో 20 శాతమన్నా దక్కని ప్రాతినిధ్యం 
  • 1999లో తెలంగాణ బీసీ ఎమ్మెల్యేలు 26 మంది.. ఇప్పుడు 22 మందే
  • చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల డిమాండ్

ఒక్క బీసీ కూడా సీఎం కాలేదు! 

ఉమ్మడి ఏపీ మొదలు తెలంగాణ రాష్ట్రం వరకు ఒక్కసారి కూడా బీసీ నాయకుడు సీఎం కాలేదు.  ఉమ్మడి ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా (1956 –1960) నీలం సంజీవ రెడ్డి ఉన్నారు. దాదాపు 12 సార్లు  రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆరుసార్లు కమ్మ సామాజికవర్గ నేతలు, మూడుసార్లు వెలమలు సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఎస్సీ, బ్రాహ్మణ, వైశ్య వర్గ నేతలు ఒక్కసారి చొప్పున సీఎం పదవి చేపట్టారు. ఈ విషయంలోనూ బీసీల్లో అసంతృప్తి నెలకొంది. సీఎం అయ్యే అర్హత తమకు లేదా? అని ఆయా వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి బీసీ నినాదం తెరపైకి వచ్చింది. దశాబ్దాలు గడుస్తున్నా రాజకీయంగా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడంతో ఆయా వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. జనాభాలో అందరి కంటే ఎక్కువున్నా.. మొదటి నుంచీ సీట్ల కేటాయింపులో అన్యాయమే జరుగుతున్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అయినా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండ్ అన్ని పార్టీల్లోనూ వినిపిస్తున్నది. కాంగ్రెస్​లో ఇప్పటికే ‘టీమ్ ఓబీసీ’ పేరుతో ఒక గ్రూపు కూడా ఏర్పాటైంది. రాజకీయాల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలూ డిమాండ్ చేస్తున్నాయి. వరుస సమావేశాలు నిర్వహిస్తూ తమ వాయిస్ ను వినిపిస్తున్నాయి. ఇలా జనాభాకు తగ్గట్టు బీసీలకు సీట్లు ఇవ్వాల్సిందేనని ఆ సామాజిక వర్గంలోని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు ఎక్కువయ్యాయి. 

ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా.. 

ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. జనాభాలో 52 శాతం మేర ఉన్న బీసీలకు రాజకీయంగా 20 శాతం కూడా ప్రాతినిధ్యం దక్కడం లేదు. 

ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే తక్కువ.. 

ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే తెలంగాణ వచ్చినంక అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. 1999లో తెలంగాణ ప్రాంతం నుంచి 24 శాతం మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు వారి వాటా 18 శాతమే. అదీగాక అప్పుడు తెలంగాణకు సంబంధించిన స్థానాలు 107 కాగా.. ఇప్పుడు మొత్తం 119కి పెరిగాయి. సీట్లు పెరిగినా బీసీల ప్రాతినిధ్యం పెరగలేదు. ఇక తెలంగాణ వచ్చాక తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీసీ ఎమ్మెల్యేల వాటా 16.8 శాతమే. ఈ లెక్కన ఉమ్మడి రాష్ట్రంలోనే కాస్తంత నయమనిపించేలా బీసీలకు ప్రాతినిధ్యం దక్కిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

రాజకీయాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన పార్టీలు.. బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కల్పించడం లేదు. బీసీ సామాజిక వర్గాన్ని అగ్రకులాల కిందనే లెక్కగట్టడంతో.. ఆయా వర్గాల నేతలు జనరల్​ కేటగిరీలోనే పోటీ చేయాల్సిన దుస్థితి ఉన్నది. బీసీలకు కూడా జనాభా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ..  ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టాలని కొన్నేండ్లుగా బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీ జనాభాను లెక్కించి, దాని ప్రకారం రాజకీయంగా, సామాజికంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు. అప్పుడెప్పుడో మండల్ కమిషన్.. రాష్ట్రంలో బీసీలు 52 శాతం ఉన్నారని చూచాయగా చెప్పింది. దాని ఆధారంగానే విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు బీసీల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారో లెక్కించాలని నేతలు డిమాండ్​చేస్తున్నారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ అమలు చేయాలని కోరుతున్నారు. 

25 ఏండ్లుగా ఇంతే..

ఉమ్మడి ఏపీలో 1999 నుంచి ఇప్పటి దాకా జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. బీసీల ప్రాతినిధ్యం చాలా తక్కువేనని స్పష్టమవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాలకే రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కుతున్నది. 48 శాతానికి పైగా స్థానాలు పెద్ద కులాల నేతలకే దక్కుతుండగా, అందులోనూ రెడ్డి సామాజిక వర్గ నేతలే 34 శాతం స్థానాలు ఎగరేసుకుపోతున్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి 107 స్థానాల్లో 26 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం (24 శాతం) లభించింది ఈ ఎన్నికల్లోనే. తర్వాత 2004లో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 17కి పడిపోగా, మళ్లీ 2009లో 25కి పెరిగింది. కానీ 2014లో 20కి పడిపోయింది. చివరిసారి 2018 ఎన్నికల్లో 22 మంది బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో బీఆర్ఎస్​నుంచి 18 మంది ఉండగా, కాంగ్రెస్ నుంచి నలుగురు గెలిచారు. అయితే కాంగ్రెస్​ఎమ్మెల్యేలు అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరడంతో.. ఇప్పుడు కాంగ్రెస్ లో బీసీ ఎమ్మెల్యేలే లేకుండా పోయారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచారు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్​లో 21 మంది, బీజేపీలో ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నారు. 

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు కోత..  

ఎస్సీ, ఎస్టీలు చదువులు, ఉద్యోగాల్లో మెరుగైన స్థానాల్లో ఉండేందుకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. అది రాజకీయాలకూ వర్తింపజేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీల్లాగానే బీసీలకూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లలో రాష్ట్ర సర్కార్ కోత పెట్టింది. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లను 27 శాతానికి తగ్గించింది. తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లోకల్ బాడీ పోల్స్​కు రిజర్వేషన్లు మొత్తంగా 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని సర్కార్ రిజర్వేషన్లు తగ్గించడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను బీసీ సంఘాల నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. చదువు, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుందన్న సుప్రీం తీర్పును.. లోకల్​ బాడీ పోల్స్​లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఒక్క బీసీ అయినా సీఎం అయ్యారా?

బీసీలను రాజకీయంగా, సామాజికంగా అణచివేస్తున్నారు. రాష్ట్రంలో 20 మంది మంత్రులుంటే ముగ్గురేనా బీసీలు. కనీసం ఏడుగురైనా ఉండాలి కదా. ఏపీ సీఎం 11 మందికి అవకాశం ఇచ్చారు. బీసీల్లో ఎక్కువ మందికి టికెట్లివ్వరు.. ఇచ్చినా గెలిపించుకోరు.. గెలిచినా అణచివేసేందుకు కుట్ర చేస్తున్నరు. 52 శాతం ఉన్న బీసీలకు ఒక్కసారైనా సీఎంగా అవకాశం వచ్చిందా? బీసీలకు మంత్రి పదవుల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోగా.. ముఖ్యమంత్రి కులానికి నాలుగు మంత్రి పదవులా? 0.4 శాతం జనాభా ఉన్న ఆ కులపోళ్లే రాజకీయాన్ని చేతుల్లో పెట్టుకున్నారు. రాజకీయాలన్నీ అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి బీసీలంతా ఆలోచించాలి. పార్లమెంట్​లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తే, రాజకీయాల్లో 50 శాతం మంది బీసీలు ఉంటరు. బీసీలు సర్పంచులైతే కూడా అగ్రకులపోళ్లు ఓర్వలేకపోతున్నారు. అడుగడుగునా బీసీలకు అన్యాయం చేస్తున్నరు. 

ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

త్యాగాలు బీసీలవి.. భోగాలు పెద్ద కులపోళ్లవా?

తెలంగాణ ఉద్యమంలో బీసీలదే కీలక పాత్ర. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ నుంచి తొలి అమరుడు శ్రీకాంతాచారి వరకు అందరూ బీసీలే. ప్రత్యేక రాష్ట్రం కోసం కొండా లక్ష్మణ్​బాపూజీ నుంచి దేశిని చిన మల్లయ్య వరకు పదవులు త్యాగం చేశారు. త్యాగాలు వారివైతే భోగాలు మాత్రం వేరేవాళ్లు అనుభవిస్తున్నారు. పోస్టులన్నీ అర శాతం, ఐదు శాతం జనాభా ఉన్న అగ్రకులాలకే ఎక్కువ దక్కాయి. బీఆర్ఎస్​.. తెలంగాణ రెడ్ల, రావుల సమితిగా మారిపోయింది. 

- జాజుల శ్రీనివాస్​గౌడ్​, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు 

బీసీలను కావాలనే ఓడగొడ్తున్నరు

రాజకీయాల్లో పెరిగి న ఖర్చులను బీసీలు తట్టుకోలేకపోతున్నా రు. చట్టసభల్లో రిజర్వేషన్లుంటే బీసీల స్థానాలు బీసీలకు ఉంటాయి. జనరల్ కేటగిరీలో పెట్టడం వల్ల అగ్రకుల పార్టీలు కావాలనే బీసీలను ఓడిస్తు న్నాయి. పేరుకు అభ్యర్థిని ప్రకటించి.. ప్రత్యర్థి గెలిచేలా పన్నాగాలు పన్నుతున్నారు. బల హీన స్థానాలు కేటాయించి ఓడిపోయేలా చేస్తున్నారు. అందుకే బీసీలకు విద్య, ఉద్యోగాల్లో ఇచ్చినట్టే 27 శాతం రిజర్వేషన్లను చట్టసభల్లోనూ అమలు చేయాలి. 

దాసు సురేశ్​, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు