అఖిలేశ్, రాహుల్ ఎజెండా యూపీ మోడల్

అఖిలేశ్, రాహుల్ ఎజెండా యూపీ మోడల్

సమాజ్​వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్,  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల  ప్రయాగ్ రాజ్  పబ్లిక్ మీటింగ్​లో  యువత  బారికేడ్లను తొలగించి పోడియం వైపు దూసుకువచ్చారు.   మైక్  ఫెయిలవడంతో  మీటింగ్  వారిద్దరి మధ్య  చర్చా వేదికగా మారింది.  చర్చలో  సమాజ్​వాది పార్టీ, కాంగ్రెస్ అలయన్స్​ను న్యాచురల్ అలయన్స్​గా  వారు పేర్కొన్నారు.  ములాయంసింగ్ గురించి,  ఉత్తరప్రదేశ్​లో  వివిధ అంశాల గురించి వారు తమ  ఆలోచనలను పంచుకున్నారు.  చర్చలో సహకారం, సారూప్యత బలంగా కనిపించింది.  వారి మధ్య  సంభాషణను  గమనిస్తే  వారిద్దిరి మధ్య బంధం  ఎంత బలంగా  ముందుకుపోతుందో  అర్థమవుతోంది.  దాన్ని  ఇండియా అలయన్స్ ఐక్యతగా చూడవచ్చు.  ఈ కలయిక  ఉత్తరప్రదేశ్  ప్రజలలో  పెద్ద ఎత్తున ఉత్సాహాన్నిస్తోంది.  అదేవిధంగా  దేశంలో  కూడా ఈ  భావన  కొనసాగుతోంది.  అఖిలేశ్, - రాహుల్  కలయికతో  'ఉత్తరప్రదేశ్  మోడల్'  దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు  కేంద్రంగా నిలిచింది.  అఖిలేశ్ యాదవ్,  రాహుల్ గాంధీల  జోడీ  సామాజిక  ప్రజాస్వామికవాదుల గెలుపును  బలోపేతం చేస్తోంది.  2017లో   వీరిద్దరూ  దో లడ్కే (ఇద్దరు యువకులు)గా   కలిసినప్పటికీ  ఎన్నికల ఫలితాల  మీద  దృఢమైన   ప్రభావాన్ని చూపలేకపోయింది.   కానీ,  2024  లోక్​సభ  ఎన్నికలలో  ఇద్దరు సోదరులుగా  బలమైన  సహకారంతో  ఇండియా అలయన్స్ నడుపుతున్నారు.  దానికి ఉత్తరప్రదేశ్  ప్రజలు, సామాజిక వర్గాలు ఐక్యమవుతూ గెలుపు దిశ వైపు అడుగులు వేస్తున్నారు.  

పీడీఏ ఎజెండా

ముఖ్యంగా సమాజ్​వాది  ఎజెండాలో  పీడీఏ (పిచ్డా, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం,  రాజ్యాంగ పరిరక్షణ,  కులగణన, రిజర్వేషన్ల రక్షణ,  విద్యకు 6%  కేటాయించడం ఉన్నాయి.  రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతున్న  కుల జనగణన,  సామాజిక,  ఆర్థిక, రాజకీయ న్యాయం,  రాజ్య వ్యవస్థలో  ఎస్సీ,  ఎస్టీ, ఓబీసీల భాగస్వామ్యం కాంగ్రెస్  ఎజెండాగా,  ఈ ఇద్దరు నాయకులు నినదిస్తున్న సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ,  రిజర్వేషన్ల రక్షణ.. ఇండియా అలయన్స్ ఎజెండాగా  దేశస్థాయిలో ముందుకుపోయింది.  ఈ రెండు పార్టీలు కలిసి నిరుద్యోగం, ధరల పెరుగుదల,  అగ్నివీర్, రిజర్వేషన్ల ఎజెండాగా ఉత్తరప్రదేశ్​లో ప్రచారంలో ఉంది.  నిరుద్యోగం,  వేతనాలలో స్తబ్ధత  ఒకవైపు ప్రజలను పీడిస్తుంటే,  రెండోవైపు  ధరల పెరుగుదల భారాన్ని సామాన్యుడు మోయలేని స్థితికి చేరుకున్నాడు.  అందుకే ఈ ఎజెండాను  ఇండియా అలయన్స్ చేపట్టింది. ప్రజలు ధరల భారాన్ని భరించలేక మోదీని ప్రశ్నిస్తున్నారు.  

ఇండియా అలయన్స్ వైపు దళితులు

దళితులు ఎక్కువ సంఖ్యలో ఇండియా అలయన్స్ వైపు చూస్తున్నారు. బీజేపీ  హిందూ, ముస్లిం విభజనను ప్రజలు ఎక్కువగా అంగీకరించడం లేదు.  మొదటి ఫేజ్​ఎలక్షన్ తర్వాత మోదీ మాట్లా డుతూ.. మంగళసూత్రాలను కూడా తీసుకొని ముస్లింలకు పంచుతారని అన్నారు.  ముస్లిం వ్యతిరేక నినాదంతో హిందువులను ఏకీకరణ చేసే ప్రయత్నం జరుగుతున్నది.  కానీ, పేదలు, సామాన్య ప్రజలు, నిరుద్యోగులు బీజేపీ ప్రయత్నాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు.   ప్రభుత్వ సంస్థలను,  ప్రకృతి వనరులను,  సేవా రంగాలను  కార్పొరేట్లకు  ధారాదత్తం  చేయడాన్ని  ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ధనికులకు ఉపయోగపడే విధంగా పన్నులను తగ్గించడం,  వారి రుణాలను  లక్షల కోట్లల్లో  మాఫీ చేయడం ఏ మాత్రం అంగీకారంగా లేదు.  రైతులు కోరుతున్న ఎంఎస్పీని బీజేపీ తిరస్కరిస్తున్నది. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పటికీ వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. పేదల విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలను, అభివృద్ధి పథకాలను మరచి,  ఐదు కిలోల  రేషన్ బియ్యంతో 80 కోట్ల మందిని కించపరచడం ముమ్మాటికీ సహించరానిది. 

అఖిలేశ్​ను అవమానించిన బీజేపీ

అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్​లోని  గౌరీశంకర్​ మహాదేవ్ మందిర్​లో పూజలు చేయడాన్ని బీజేపీ అవమానించింది.  మందిరాన్ని వారి కార్యకర్త
లతో శుద్ధి చేయించింది.  ఒక మాజీ  ముఖ్యమంత్రినే  బీజేపీ  ప్రభుత్వం ఇంతగా కించ పరుస్తుంటే,  ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితి ఏంటి?  ఇంతకుముందు  అఖిలేశ్​ ముఖ్యమంత్రి భవనాన్ని ఖాళీ చేస్తే  యోగి ఆదిత్యనాథ్ ఆ భవనానికి గంగాజలంతో శుద్ధి చేయించినారు.  అభివృద్ధి,  సంక్షేమం,  రాజ్యాంగ రక్షణ  ద్వారానే  సాధ్యమవుతుందని ఇండియా అలయన్స్ అంగీకరింపజేస్తోంది. బీజేపీ  ప్రభుత్వం దళిత-  ఓబీసీ అస్తిత్వానికి  ముప్పుగా  తయారవుతుందని గమనించడం మొదలైంది. ఎదిగిన సామాజిక శక్తులు సుముఖంగా  లేరు.  ఎక్కువశాతం ఎస్పీ,- కాంగ్రెస్​లతో  కలిసి ఉత్తరప్రదేశ్​లో నడుస్తున్నారు.  ఓట్లు వేసి ఆధిపత్య -ధనిక వర్గాల కొమ్ముకాసే  బీజేపీని నిలదీస్తున్నారు. 

సామాజిక రాజకీయానికి నాంది

యూపీలోని 80 ఎంపీ స్థానాలకుగాను 17 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.  63 స్థానాల్లో  సమాజ్​వాది పార్టీ పోటీ చేస్తోంది.  ఎస్పీని యాదవ– -ముస్లిం పార్టీ అనే  బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈసారి యాదవులకు, ముస్లింలకు ఎంపీ టికెట్లు  బాగా తగ్గించారు. 30 వరకు టికెట్లను ఎంబీసీలకు ఇవ్వడం జరిగింది.  కొన్ని జనరల్  స్థానాలలో దళితులను నిలబెట్టడం సామాజిక- రాజకీయ పరివర్తనకు నాంది పలుకుతోంది.   దళితులకు 20 టికెట్లు,  కుర్మిలకు 12 టికెట్లు,  సాక్య,  మౌర్య,  కుష్వా, సాయినీలకు ఎనిమిది టికెట్లు. నిషాద్,  బిందులకు  ఐదు, యాదవులకు నాలుగు,  ముస్లింలకు నాలుగు టికెట్లు ఇవ్వడమైంది.  వీరు సామాజిక న్యాయంతోపాటు సోషల్ ఇంజినీరింగ్​లో  భాగంగా  ఎక్కువ  కులాలను  ఎన్నికలలో నిలపడంతో  వారిలో  నూతన ఉత్సాహం కనిపిస్తోంది.  ఇలా 20కి మించి కులాలకు టికెట్లు ఇవ్వడంతో సమాజ్​వాది పార్టీ,  ఇండియా అలయన్స్ ఒక ఎన్నికల మోడల్​ను  భారతదేశం ముందు ఉంచింది.  అఖిలేశ్​ యాదవ్, రాహుల్ గాంధీల కలయిక ఉత్తర ప్రదేశ్ మోడల్ రూపంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇండియా అలయన్స్ మోడల్​లోనే భారత్ భవిష్యత్తు ఉన్నది. అటువైపు తెలంగాణ సిద్ధం కావాలి.

- ప్రొఫెసర్ సింహాద్రి సోమనబోయిన,  రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీ