- 2002లో 46 మంది నక్సల్స్..
- ఆయుధాలతో సహా లొంగిపోయిన జనశక్తి నేత రణధీర్
- తాజాగా 61 మందితో సరెండర్ అయిన సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాల్
- ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులే
- నాటి ఘటనను గుర్తు చేసుకుంటున్న జనం
కరీంనగర్, వెలుగు : మావోయిస్ట్ పార్టీలో ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు 2002లో కరీంనగర్ జనశక్తి పార్టీలో జరిగిన ఘటనలను గుర్తుకు తెస్తున్నాయి.
బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు సమీప బంధువైన మార్తండరావును కిడ్నాప్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన సీపీఐ(ఎంఎల్) జనశక్తి కరీంనగర్ జిల్లా కార్యదర్శి సుంకటి సాయిలు అలియాస్ రణధీర్ కొన్ని రోజులకే అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో లొంగిపోయారు.
ఆయనతో పాటు 46 మంది జనశక్తి నక్సల్స్ ఆయుధాలతో సహా సరెండర్ అయ్యారు. రాష్ట్రంలో పీపుల్స్ వార్, జనశక్తి నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న ఆ రోజుల్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 23 ఏండ్లకు మళ్లీ అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకోవడం, అక్కడ లొంగుబాటుకు నేతృత్వం వహించింది పెద్దపల్లి వాసి, మావోయిస్ట్ నేత మల్లోజుల వేణుగోపాల్ కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ప్రజలు నాటి రణధీర్ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.
జనశక్తిని దెబ్బతీసిన రణధీర్ లొంగుబాటు
2001 అక్టోబర్ 26న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి విద్యాసాగర్‌రావు బంధువు మార్తాండరావును జనశక్తి జిల్లా కార్యదర్శి రణధీర్ నేతృత్వంలోని దళం కిడ్నాప్ చేసి రూ. కోటి మేర వసూలు చేశారు. దీంతో రణధీర్ టార్గెట్‌గా పోలీసులు గాలింపు ముమ్మరం చేయడం, నిర్బంధం పెరగడంతో అతడు లొంగిపోయేందుకు సిద్ధమయ్యాడు. జిల్లాలోని దళాలన్నింటిలో పనిచేస్తున్న 46 మందితో కలిసి ఆయుధాలతో సహా 2002 ఏప్రిల్ 28న అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో లొంగిపోయారు.
జీ3 అస్సాల్ట్ రైఫిల్, ఐదు స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్స్, 303 తుపాకులు, ఒక స్టెన్ గన్, 9 డీబీబీఎల్, ఎస్‌బీబీఎల్ తుపాకులను పోలీసులకు అప్పగించారు. దీంతో జనశక్తికి ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
రణధీర్ లొంగుబాటులో అప్పటి ఎస్పీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఓఎస్డీ ఎన్.మధుసూదన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే లొంగుబాటు సమాచారం అందుకున్న అప్పటి జనశక్తి రాష్ట్ర కార్యదర్శి కూర దేవేందర్ అలియాస్ అమర్ ఏప్రిల్ 22న రణధీర్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
61 మందితో లొంగిపోయిన మల్లోజుల
మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బుధవారం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. ఆయన వెంట వివిధ క్యాడర్లకు చెందిన 61 మంది మావోయిస్టులు కూడా సరెండ్ అయ్యారు.
మావోయిస్ట్ పార్టీలో కేంద్ర కమిటీ స్థాయిలో పనిచేస్తూ గతంలో పలువురు లొంగిపోయినప్పటికీ.. వారంతా ఒకరిద్దరుగానే వివిధ కారణాలతో సరెండర్ అయిన ఘటనలు ఉన్నాయి. అది కూడా ఆయుధాలు అప్పగించకుండా నిరాయుధంగా వచ్చి లొంగిపోయారు. కానీ వేణుగోపాల్ గతంలో జనశక్తి నేత రణధీర్ తరహాలోనే భారీ సంఖ్యలో లీడర్లు, సభ్యులతో కలిసి ఆయుధాలతో సహా లొంగిపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
