
రక్షణ రంగంలో భారత్ టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే భారత త్రివిధ దళాలలో లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తున్న రక్షణ శాఖ.. లేటెస్టుగా ఇండియన్ నేవీలో ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలను తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇండియాకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వార్ షిప్ (యుద్ధ నౌక) తయారు చేసేందుకు రోల్స్-రాయిస్ సంస్థ భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
అందులో అడ్వాన్స్డ్ హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రాపల్షన్ సిస్టం ను వినియోగించనుంది. అంటే గ్యాస్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ పవర్ వినియోగించి నౌకను అత్యంత వేగంగా, సమర్ధవంతంగా, తక్కువ ఇంధనంతో పనిచేసేందుకు కావాల్సిన టెక్నాజీతో తయారు చేయనున్నారు.
ఇండో పసిఫిక్ మిషన్ లో భాగంగా యూకే కు చెందిన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (CSG) ఈ వారం ముంబయికి వచ్చిన సందర్భంగా.. ఇండియన్ నావీతో కొలాబొరేట్ కానున్నట్లు ప్రకటించింది. ఇండియాకు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వార్షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. క్లీన్ ఎనర్జీలో భాగంగా ఫ్యూచర్ టెక్నాలజీని వినియోగించి కొత్త తరం యుద్ధ నౌకలను తయారు చేయనున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రిక్ యుద్ధ నౌక తయారీలో అత్యంత శక్తివంతమైన MT30 మెరైన్ గ్యాస్ టర్బైన్ ను వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది 36 మెగావాట్ల పవర్ ను జెనరేట్ చేస్తుంది.
క్లీన్ ఎనర్జీతో నడిచే డిఫెన్స్ టెక్నాలజీ కోసం ఇండియా లక్ష్యంలో ఈ పార్ట్నర్షిప్ కీలకం కానుంది. ఈ కొత్తతరం యుద్ధ నౌక ఇంధన సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా.. పర్యావరణ అనుకూలంగా.. అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా డిఫెన్స్ ఉత్పత్తులు తయారు చేసేందుకు ముందుకు వస్తున్నట్లు రోల్స్ రాయిస్ కంపెనీ ప్రకటించింది.