అక్టోబర్ 16 ప్రపంచ ఆహార దినోత్సవం: 23% వృథా అవుతున్న ఆహార ఉత్పత్తులు

అక్టోబర్ 16  ప్రపంచ ఆహార దినోత్సవం: 23% వృథా అవుతున్న ఆహార ఉత్పత్తులు

ఆహార ఉత్పత్తులు వృథా కావడం ద్వారా వివిధ వ్యవసాయ ఉత్పత్తులు ఉత్పత్తి చేయడానికి వాడిన  విత్తనాలు, వ్యవసాయానికి వాడిన నీళ్లు, కరెంటు, ఎరువులు,  పెస్టిసైడ్స్,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన  వివిధ రకాల సబ్సిడీలు నిరుపయోగంగా మారుతున్నాయి.  

వ్యవసాయ యాంత్రీకరణ  కోసం వాడిన  విలువైన  ఇంధన వనరులు,  కూలీల ఖర్చు  పంట కోత అనంతరం చేసిన  వివిధ ఖర్చులు  మొదలైనవి  సుమారు 38 శాతం శక్తి వినియోగం వృథాగా పోతున్నాయి.  మరో 7 శాతం రిటైల్స్ షాపులలో, 10 శాతం  హోటల్స్,  ఇతర క్యాటరింగ్  వంటి ఆహార సేవలలో వృథా అవుతోంది. 

మరో చేదు నిజం ఏమిటంటే గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 690 నుంచి780 మిలియన్ల ప్రజలు ఆకలితో అలమటించారు. 2024వ సంవత్సరంలో సుమారు 20 దేశాలు, వాటి సరిహద్దులలో యుద్ధ వాతావరణం కారణంగా 140 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.  

మోతాదుకు మించి రసాయన ఎరువులు

మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం, పంట మార్పిడి చేయకపోవడం, నేలలు సారం కోల్పోవడం వల్ల గత 70 సంవత్సరాలలో మన పండిస్తున్న వివిధ ఆహార పంటలలో  పోషకాలు, విటమిన్లు  తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది  వివిధ సూక్ష్మ పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. చక్కెర వ్యాధి (డయాబెటిస్), అధిక రక్తపోటు అనే జీవనశైలి వ్యాధులు మనదేశంలో ప్రతి ఇంట్లోకి ప్రవేశించాయి.  ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ రెండు వ్యాధులలో ఏదో ఒకదానితో సతమతమవుతున్నారు.

 అంతేకాకుండా 2050 సంవత్సరం నాటికి  ప్రపంచ ఆహార డిమాండ్​ను తీర్చడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న భూమి నుంచే వ్యవసాయ ఉత్పత్తులు సుమారు 60 శాతం పెరగాలి.  మరోచోట దీనికి భిన్నంగా ఎక్కువ మోతాదులో జంక్ ఫుడ్ తీసుకోవడం  శారీరక శ్రమ లేకపోవడం, ఆహార కల్తీ వలన ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల మంది యువత,  సుమారు 35.5 మిలియన్ల ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలు   స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఇది తీవ్ర వ్యత్యాసాలు గల ఆహార వ్యవస్థలను సూచిస్తున్నది. 

తగ్గిపోతున్న వ్యవసాయ భూమి

మరోవైపు సుస్థిరమైన ఆహార వ్యవస్థలను పెంపొందించడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.  ముఖ్యంగా  వ్యవసాయ భూమి తగ్గిపోతున్నది.  వేగవంతమైన పట్టణీకరణతో  టైర్- 2 & టైర్ -3 నగరాలు పెరుగుతున్నాయి.  కలుషితమవుతున్న నేల, నీరు, గాలి, పంట మార్పిడి లేకపోవడంతో సారవంతమైన నేలలు తగ్గిపోతున్నాయి.  వాతావరణ మార్పులు వల్ల  అకాల వర్షాలు,  వరదలు,  కరువు కాటకాలు సంభవిస్తున్నాయి.  నాణ్యత లేని విత్తనాలు,   మొలక శాతం తగ్గుతోంది.  

 అకాల చీడపీడల ఉధృతి వలన  పంట నష్టం జరుగుతున్నది.  పెట్టుబడి రుణాల భారం,  మైక్రో ఫైనాన్స్ వ్యధలతో  రైతులు కుదేలవుతున్నారు.   జనాభా వృద్ధిరేటుకు అనువుగా వ్యవసాయ ఉత్పత్తుల  పెరుగుదల ఉండటం లేదు.   ఆర్థిక మందగమనం, ప్రపంచ వాణిజ్యం  పన్నుపోటుకు గురి కావడంతో యువత వ్యవసాయంపైన ఆసక్తి చూపడం లేదు.   

వ్యవసాయ  రంగంలో వచ్చే లాభనష్టాలను  ఇతర  రంగాలతో పోల్చుకోవడంతో  రైతుకుటుంబాలు తగ్గిపోతున్నాయి.  రైతు కుటుంబ సభ్యులు పట్టణాలకు వలస వెళ్లడం,  వ్యవసాయ రంగంలో వచ్చిన  యాంత్రీకరణ, ఇతర  విప్లవాత్మకమైన మార్పులు వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం

పాడి పశువులను పెంపొందించడంలో  రైతులు ఆసక్తి కనబరచడం లేదు.  పాడి పశువులకు దాణా కొరత వేధిస్తోంది.  ఎగుమతి సబ్సిడీలు,  ఆహార దిగుమతులు, ఆర్థిక మందగమనం, మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో ఒకే రకమైన పంట చేతికి వచ్చినప్పుడు  ధరల ఆటుపోట్లకు లోనవ్వడంతో  రైతుల ఆర్థిక పరిస్థితి  అగమ్యగోచరంగా మారింది. 

 ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంటనష్టం,  నిల్వ  చేసే గోడౌన్లు  లేకపోవడం, ఉత్పత్తికి సరిపడా  ప్రాసెసింగ్ చేసే ఆహార పరిశ్రమలు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాలవల్ల  భవిష్యత్తు  ఆహార భద్రత పైన  తీవ్ర ప్రభావం చూపుతున్నది. . కష్టపడి పనిచేసినా రాబడికి హామీ లేని వ్యవసాయ ఉత్పత్తి చక్రంలో చాలా మంది రైతులు  చిక్కుకున్నారు.  

సమీకృత వ్యవసాయం,  పంట మార్పిడి,  వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ,  పంట ఉత్పత్తుల  నిర్వహణ  కష్టతరంగా మారింది.  మార్కెట్ డిమాండ్  ఆధారిత  ఆహార ఉత్పత్తులు,  పంట కోత అనంతరం నష్టాలను తగ్గిస్తూ,  పొలం నుంచి  వంటశాల వరకు  వ్యవసాయ గొలుసును  పటిష్టం చేయాలి.  ఆహార ఉత్పత్తుల  వృథాను  తక్షణమే  తగ్గించడానికి  పబ్లిక్,  ప్రైవేట్  ఒప్పందాల ద్వారా  మెరుగుపరచడానికి  వివిధ దేశాల ప్రభుత్వాలు  ముందుకు రావాలి.   ఈ మేరకు  ఫుడ్ అండ్ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్  ప్రపంచ ఆహార దినోత్సవం-2025 సందర్భంగా  ఉజ్వలమైన భవిష్యత్తు, ఆహార భద్రత  కోసం  చేయి చేయి కలపాలని  కోరుకుంటోంది. 

ఆహార ఉత్పత్తుల ఎగుమతితో  ఆర్థికవృద్ధి

 దేశంలో పండించే పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం తరచుగా వినే మాట  గింజ  నిల్వ,  గింజ ఉత్పత్తికి సమానం (ధాన్యం ప్రాసెసింగ్, ధాన్యం ఉత్పత్తికి సమానం),   కావున పండించిన పంట  వృథా కాకుండా  పంట కోత అనంతరం  జాగ్రత్తలు తీసుకోవాలి.  విలువ జోడించడం,  గోడౌన్  యాజమాన్య పద్ధతులు,  సమర్థమైన వ్యవసాయ వ్యాల్యూ చైన్  మేనేజ్మెంట్ సమర్థంగా నిర్వహించాలి.   

ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం నుంచి  వినియోగదారుడి పళ్లెం వరకు  సరైన  జాగ్రత్తలు  తీసుకున్నట్లయితే  పండించిన ప్రతి ఆహార ఉత్పత్తితో  రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.  ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించడంతోపాటు  గ్రామీణ యువతీ యువకులకు  ఉపాధి కల్పన జరుగుతుంది.  ఆహార ఉత్పత్తుల ఎగుమతి ద్వారా దేశ ఆర్థికరంగాన్ని  బలోపేతం అవుతుంది.   కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్  ప్రాసెసింగ్​పై దృష్టి సారించడం తక్షణ అవసరం.  తద్వారా మాత్రమే భారత్​ 2047 నాటికి లక్ష్యానికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. 

- డా. ఎ. పోశాద్రి,  అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్​​ వర్సిటీ​-