
భారతదేశం నేటి ప్రపంచంలో డిజిటల్ శక్తిగా ఎదుగుతున్నతరుణంలో ‘డిజిటల్ సార్వభౌమాధికారం’ అనే భావన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల విస్తరణ మన జీవితాలను సులభతరం చేస్తూనే, దేశాల మధ్య ఆధిపత్య పోరాటానికి వేదికగా మారాయి.
ఈ పోరాటంలో ప్రధాన ఆయుధం డేటా. అంటే సమాచారం. మన డేటాపై ఎవరి నియంత్రణ ఉందన్నది ఇప్పుడు జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వాతంత్య్రానికి సంబంధించిన కీలక ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ యాజమాన్యంలోని వాట్సాప్, గూగుల్, ఫేస్బుక్ వంటి వేదికలపై ఆధారపడకుండా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, వినియోగించడం కేవలం సాంకేతికతకే సంబంధించినది మాత్రమే కాదు. అది భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన జాతీయ లక్ష్యం. కాగా, భారతదేశం 2000లో ఐటీ చట్టం అమలుతో డిజిటల్ రంగంలో అడుగుపెట్టింది.
డేటా గోప్యతపై ఆందోళనలు
2016లో రిలయన్స్ జియో ప్రవేశంతో ఇంటర్నెట్ ప్రాధాన్యత విస్తృతమైంది. ప్రతి గ్రామం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఇంటర్నెట్ చేరింది. ఈ విప్లవం ఒకవైపు దేశాన్ని డిజిటల్ దిశగా నడిపినా, మరోవైపు విదేశీ కంపెనీలపై ఆధారపడే పరిస్థితిని మరింత బలపరిచింది. వాట్సాప్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వంటి యాప్‌లు భారతీయుల వ్యక్తిగత, ప్రభుత్వ, వ్యాపార సమాచారాన్ని తమ సర్వర్లలో నిల్వ చేయడం ప్రారంభించాయి.
దీని ఫలితంగా భారత డేటా భద్రత, గోప్యతపై కొత్త ఆందోళనలు తలెత్తాయి. ఇదే సందర్భంలో డేటా స్థానికీకరణ అంశం ప్రాముఖ్యత పొందింది. 2019లో ప్రభుత్వం దీనిపై ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ‘మన డేటా మన దేశంలోనే ఉండాలి’ అనే నినాదం ఉధృతంగా మారింది. అదే సమయంలో ఆత్మనిర్భర్ భారత్ పిలుపు భారత సాంకేతిక రంగానికి కొత్త ఊపునిచ్చింది. ఈ పిలుపుతో పూర్తిగా భారతీయ సాంకేతిక నైపుణ్యంతో రూపుదిద్దుకున్న 'అరట్ట్కె', 'జోహెూ మెయిల్', 'సందేశ్', 'కూ' వంటి యాప్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఇవి కేవలం కమ్యూనికేషన్ సాధనాలుగా కాకుండా, భారత సాంకేతిక సార్వభౌమాధికారానికి ప్రతీకలుగా నిలిచాయి.
స్వదేశీ యాప్‌లతో డేటా భద్రత
స్వదేశీ యాప్‌లలో ఉన్న సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు సాటిగా ఉంది. ఉదాహరణకు, జోహెూ మెయిల్ అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, డేటా భారతదేశంలోనే నిల్వ ఉంటుందని హామీ ఇస్తుంది. అరట్ట్కె, ముఖ్యంగా ప్రభుత్వ అవసరాల కోసం రూపొందించిన ఈ యాప్, వాట్సాప్‌తో సమానమైన ఎండ్- టు- ఎండ్ ఎన్క్రిప్షన్ అందిస్తుంది.
2021లో వాట్సాప్ గోప్యతా విధాన మార్పులు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నప్పుడు, స్వదేశీ యాప్‌లు విశ్వసనీయతను నిలబెట్టుకున్నాయి. భద్రతా ప్రమాణాల పరంగా ఇవి భారతీయ సర్చ్ఇన్ మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించడం ద్వారా విదేశీ నిఘా, డేటా లీక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి.
మన ముందున్న సవాళ్లు
స్వదేశీ యాప్‌లు ముందున్న ప్రధాన సవాలు వినియోగదారుల విస్తరణలో ఉంది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా, స్వదేశీ యాప్‌లు ఇంకా వ్యాప్తి దశలోనే ఉన్నాయి. వినియోగదారుల అలవాట్లు, నెట్వర్క్ ప్రభావం వంటి అంశాలు విస్తరణకు ఆటంకాలుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వం, సైన్యం, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలు ముందుగా స్వదేశీ యాప్ వినియోగాన్ని తప్పనిసరి చేయడం ద్వారా ఒక బలమైన ప్రామాణిక వేదికను ఏర్పరచవచ్చు. ఈ విధానంతో కార్పొరేట్ రంగం, సాధారణ ప్రజలలో కూడా విశ్వాసం పెరుగుతుంది.
ప్రత్యేకంగా ప్రభుత్వ లేదా రక్షణ రంగానికి సంబంధించిన సమాచార మార్పిడిలో విదేశీ యాప్‌ల వినియోగం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. అమెరికాలో అమల్లో ఉన్న క్లౌడ్ చట్టం ప్రకారం, ఆ దేశానికి చెందిన కంపెనీలు తమ సర్వర్లలో ఉన్న డేటాను అమెరికా ప్రభుత్వ అధికారులకు అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. దీని వలన భారత ప్రభుత్వం లేదా పౌరుల డేటా కూడా విదేశీ ఏజెన్సీలకు చేరే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో స్వదేశీ యాప్‌ల వినియోగం మన డేటా స్వాతంత్ర్యాన్ని కాపాడే ఏకైక మార్గంగా మారుతుంది. డిజిటల్ సార్వభౌమాధికారానికి మరో కోణం ‘సాంకేతిక నైతికత’.
స్వదేశీ యాప్‌లను ప్రోత్సహించాలి
స్వదేశీ యాప్‌ల అభివృద్ధి కేవలం సాంకేతిక ఆవిష్కరణకే పరిమితం కాకుండా, భారతీయ విలువలు, సాంస్కృతిక భావనలను ప్రతిబింబించాలి. ప్రపంచ సాంకేతిక రంగంలో మన స్థానం బలపడాలంటే, మన సాఫ్ట్వేర్లు మాత్రమే కాదు, మన దృక్పథం కూడా స్వతంత్రంగా ఉండాలి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్, మేడ్ ఇన్ ఇండియా క్లౌడ్ సర్వీసులు, నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ వంటి పథకాల ద్వారా సాంకేతిక మౌలిక వసతులను బలోపేతం చేస్తోంది.
ఇలాంటి చర్యలతోపాటు, సాంకేతిక విద్యా వ్యవస్థలో స్వదేశీ పరిశోధన, డిజిటల్ భద్రతా అవగాహన, ఓపెన్ సోర్స్ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం. విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, స్టార్టప్‌లు ఈ దిశగా సమన్వయంతో ముందుకు సాగితే, భారతదేశం ప్రపంచ డిజిటల్ వేదికపై స్వతంత్ర శక్తిగా నిలుస్తుంది.
స్వదేశీ యాప్‌లను ప్రోత్సహించడం కేవలం విదేశీ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. అది దేశ డిజిటల్ భవిష్యత్తును మన చేతుల్లో ఉంచుకునే చారిత్రక ప్రయత్నం. అరట్ట్కె, సందేశ్, జోహె మెయిల్, కూ, మోజ్, షేర్ చాట్ వంటి వేదికలు ఈ మార్గంలో తొలి అడుగులు. ఈ యాప్‌ల ద్వారా భారతదేశం కేవలం సాంకేతికంగా స్వతంత్రం అవ్వడం కాదు, ఒక కొత్త డిజిటల్ సంస్కృతిని నిర్మిస్తోంది. అదే నిజమైన సాంకేతిక సార్వభౌమాధికారానికి దారి చూపే భారతీయ మార్గం.
- డా. రావుల కృష్ణ,అసిస్టెంట్ ప్రొఫెసర్,హెచ్‌సీయూ -