
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పబ్లిక్ స్కూల్స్ (KPS) విద్యార్థుల కోసం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వేల మంది స్కూల్ పిల్లలు ఇకపై స్కూలుకు ఫ్రీగా బస్సులో వెళ్లొచ్చు, రావోచ్చు.
చాలా మంది పిల్లలకు, స్కూల్‌కు వెళ్లడం అంత తేలికైన పని కాదు. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు స్కూల్‌కు చేరుకోవడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది లేదా డబ్బు ఇచ్చి బస్సుల్లో/ ప్రైవేట్ వాహనాలో వెళ్లాలి. ఇప్పుడు ప్రభుత్వ కొత్త ఆలోచనతో KPS స్కూల్స్‌లో చదివే పిల్లలు ఎలాంటి ఖర్చు/భారం లేకుండా ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు.
ఈ పథకం ముఖ్యంగా స్కూల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే విద్యార్థులకు వర్తిస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, బస్సు సౌకర్యం తక్కువగా ఉన్న చోట ఈ ఉచిత ప్రయాణం చాలా మందికి సహాయపడుతుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వ స్కూల్స్ (KPS) ప్రైమరీ నుండి ఇంటర్ వరకు ఒకేచోట నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఇవి పట్టణ, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాల ఉపయోగపడుతున్నాయి. కానీ, ఇంటికీ స్కూల్‌కీ మధ్య దూరం ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉంది.
పల్లెల్లో ఉండే పిల్లలు ఎండలో లేదా వర్షంలో ఐదు లేదా ఆరు కిలోమీటర్లు నడవడం అంత మామూలు విషయం కాదు. కానీ ప్రతిరోజు బస్సు చార్జీలు భరించలేక చాలామంది పిల్లలు స్కూల్‌కి వెళ్లడం మానేస్తున్నారు. అందుకే, ప్రయాణ ఖర్చుల వల్ల ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త ఉచిత బస్సు ప్రయాణ స్కిం రూపొందించింది.
కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేయడంతో పాటు, పిల్లలు స్కూల్‌కు రావడం పెంచడం, చదువు మానేయకుండా చూడటం కూడా ఈ పథకం లక్ష్యమని విద్యా శాఖ చెబుతోంది. ప్రతిరోజు బస్సు సౌకర్యం ఉండటం వల్ల పిల్లలు ఎక్కువ రోజులు డుమ్మా కొట్టకుండా సురక్షితంగా స్కూల్‌కు రావడం ఒక అలవాటు చేసుకుంటారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం తల్లిదండ్రుల ఆందోళనలను కూడా తగ్గించింది.
పిల్లల భద్రత మరొక ముఖ్యమైన విషయం. ఇంతకుముందు చాలా మంది పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు స్కూల్‌కు చేరుకోవడానికి నిర్మానుష్య రోడ్ల మీద చాలా దూరం నడవాల్సి వచ్చేది లేదా రద్దీగా ఉండే రోడ్లు దాటాల్సి వచ్చేది. ఈ కొత్త పథకం ద్వారా సురక్షితమైన, నమ్మకమైన ప్రయాణం దొరుకుతుంది.
విద్యా మంత్రి ప్రకారం బస్సులు సమయానికి నడుస్తాయని, KPS స్కూళ్ల సమీపంలో అందుబాటులో ఉంటాయని తెలుపుతూ, రాష్ట్రం స్థానిక రవాణా శాఖలతో కలిసి పనిచేస్తుందన్నారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం ఏ తరగతి అయినా సరే, KPS స్కూల్స్‌లోని విద్యార్థులందరికీ వర్తిస్తుంది. దీని వల్ల ముఖ్యంగా ఆర్థిక కష్టాల వల్ల పిల్లలను స్కూల్స్‌కు పంపలేని కుటుంబాలు కూడా ఇప్పుడు పంపుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వ స్కూల్స్ గౌరవాన్ని కూడా పెంచుతుందని భావిస్తున్నారు. మంచి సౌకర్యాలు, ఉచిత సదుపాయాలతో కర్ణాటక ప్రభుత్వ స్కూల్స్ నెమ్మదిగా తల్లిదండ్రుల నమ్మకాన్ని తిరిగి పొందుతున్నాయి.
ఈ పథకం అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేస్తుంది. పిల్లలు చదువు మానేసే రేట్లను తగ్గించడానికి, ప్రభుత్వ స్కూల్స్ విద్యను బలోపేతం చేయడానికి, పల్లె, పట్టణ విద్య మధ్య తేడాను తగ్గించడానికి అధికారులు దీనిని ఒక గొప్ప ప్రయత్నంగా చూస్తున్నారు.