జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల కేసు.. మేం జోక్యం చేసుకోలేం.. ఎలాంటి ఆదేశాలనూ ఇవ్వలేం: హైకోర్టు

జూబ్లీహిల్స్ ఫేక్ ఓట్ల కేసు.. మేం జోక్యం చేసుకోలేం.. ఎలాంటి ఆదేశాలనూ  ఇవ్వలేం: హైకోర్టు
  • ఇప్పటికే జిల్లా ఎన్నికల ఆఫీసర్లు విచారిస్తుండ్రు
  • మాగంటి  సునీత, కేటీఆర్ పిటిషన్ పై వాదనలు
  • విచారణ ముగించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఓట్‌ చోరీపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చింది. అదే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వలేమని తెలిపింది. బోగస్‌ ఓట్లు తొలగించాలంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై సీజే అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.   

జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్‌ జాబితాలో చేరారని బీఆర్‌ఎస్‌ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు వినిపించారు.  జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని బెంచ్ కు తెలిపారు. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయన్నారు. కొంతమందికి రెండు ఓట్లు కూడా ఉన్నాయని వివరించారు.  పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్‌ కోర్టుకు తెలిపారు. 

ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియని, 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారని వాదనలు వినిపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ పిటిషన్‌లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందన ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నది. ఈ కేసు విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది.