కర్నాటకలో బయటపడ్డ లంకెబిందె..లక్కుండి గ్రామంలో తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశం

కర్నాటకలో బయటపడ్డ లంకెబిందె..లక్కుండి గ్రామంలో తవ్వకాలకు ప్రభుత్వ ఆదేశం

గదగ్ (కర్నాటక): కర్నాటకలోని గదగ్ జిల్లాలో గల చారిత్రక లక్కుండి గ్రామంలో ఇటీవల ఓ కుటుంబం ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా లంకె బిందే బయటపడింది. తామ్రపు చెంబులో సుమారు 466 గ్రాముల నుంచి 470 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. ఆ ఆభరణాలను మొదటగా 14 ఏండ్ల బాలుడు ప్రజ్వల్ బసవరాజ్ రిత్తి కనుగొన్నాడు. అతను తన తల్లి గంగవ్వతో కలిసి ఆ ఆభరణాలను జిల్లా అధికారులకు అప్పగించాడు. 

ఆ ఆభరణాలు 300 నుంచి 400 ఏండ్ల నాటివిగా అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ చారిత్రక గ్రామంలో పూర్తిస్థాయి తవ్వకాలు చేపట్టాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచి లక్కుండి గ్రామంలోని కోటే వీరభద్రేశ్వర ఆలయం ప్రాంగణంలో పూర్తిస్థాయి తవ్వకాలు ప్రారంభించింది. టూరిజం, పురావస్తు శాఖ, మ్యూజియం అండ్ హెరిటేజ్ శాఖతో పాటు లక్కుండి హెరిటేజ్ డెవలప్‌‌మెంట్ అథారిటీ, జిల్లా అధికారులు ఈ పనులు  చేపట్టారు. జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్లను తరలించి ఆలయం ప్రాంగణంలో తవ్వకాలు ప్రారంభించారు. 

10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పులో తవ్వకాలు చేపట్టేందుకు నోటిఫై చేశారు. లక్కుండి గ్రామం ఒకప్పుడు చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసాలులు, కలచూరులు, విజయనగర రాజులు పాలించిన ప్రాంతం. పురాతన కాలంలో ఇక్కడ బంగారు నాణేలు తయారు చేసేవారని పురావస్తు శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో బంగారు, వెండి, వజ్రాలు, ముత్యాలు, పగడాలు, క్యాట్స్ ఐ స్టోన్స్ వంటి విలువైన వస్తువులు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

కాగా, శతాబ్దాల నాటి బంగారు ఆభరణాలు దొరకడంతో అక్కడ తవ్వకాలు జరిపేందుకు లక్కుండి నుంచి గ్రామస్తులను తరలించే విషయాన్ని కర్నాటక ప్రభుత్వం పరిశీలించవచ్చని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ తవ్వకాల ఫలితాల ఆధారంగా గ్రామస్తులను తరలించాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా, తమ ఇంట్లో లంకెబిందె దొరకడంతో దానిని జిల్లా అధికారులకు అప్పగించిన బాలుడు ప్రజ్వల్ బసవరాజ్ రిత్తిని ఆఫీసర్లు ఘనంగా సన్మానించారు.