Abhishek Sharma: రెండు విభాగాల్లోనూ మనోళ్లదే హవా.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న అభిషేక్, స్మృతి మంధాన

Abhishek Sharma: రెండు విభాగాల్లోనూ మనోళ్లదే హవా.. ఐసీసీ అవార్డు గెలుచుకున్న అభిషేక్, స్మృతి మంధాన

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను ఐసీసీ అవార్డు వరించింది. ఈ పంజాబ్ విధ్వంసకర బ్యాటర్ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి 2025 సెప్టెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఆసియా కప్ లో అభిషేక్ టోర్నీ అంతటా తన విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. మొత్తం 314 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికైన అభిషేక్.. సహచరుడు కుల్దీప్ యాదవ్,  జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ లను ఓడించి ఈ అవార్డు గెలుచుకున్నాడు. 

అవార్డు గెలుచుకున్న తర్వాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. " ఐసీసీ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఆడిన ఇన్నింగ్స్ లు విజయాల్లో భాగం కావడం చాలా సంతోషంగా అనిపించింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల నుండి విజయాలను సాధించగల జట్టులో భాగం కావడం గర్వంగా ఉంది. టీ20 క్రికెట్ లో ఇటీవలి మా ట్రాక్ రికార్డ్ గమనిస్తే అత్యుత్తమ జట్టుగా తెలుస్తుంది. నాకు సపోర్ట్ గా ఉన్నందుకు జట్టు యాజమాన్యానికి.. నా సహచరులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్యానెల్‌కు కూడా నా ధన్యవాదాలు". అని అభిషేక్ శర్మ తెలిపాడు. 

మహిళల విభాగంలో మంధానకే అవార్డు:  

మహిళల విభాగంలోనూ ఐసీసీ అవార్డు ఇండియా ప్లేయర్ కే రావడం విశేషం. టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన 2025 సెప్టెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. టీమిండియా వైస్-కెప్టెన్ మంధాన సెప్టెంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించింది. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 58, 117, 125 పరుగులు చేసి రికార్డులు నెలకొల్పింది. 
ఓవరాల్ గా నాలుగు వన్డేల్లో 77 యావరేజ్ 135.68 స్ట్రైక్ రేట్‌తో 308 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో మంధాన కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాటర్ గా నిలిచింది. 

 నెంబర్ వన్ ర్యాంక్ లో అభిషేక్:   

బుధవారం (అక్టోబర్ 1) విడుదలైన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌లో అభిషేక్ 931 రేటింగ్ పాయింట్లు సాధించి, ఐసీసీ చరిత్రలోనే అత్యధిక పాయింట్లు అందుకున్న బ్యాటర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ఆసియా కప్‌‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌‌గా నిలిచిన అభిషేక్.. 2020లో డేవిడ్ మలాన్ (919 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఆసియా కప్ లో ఈ పంజాబీ స్టార్ 314 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. యావరేజ్ 44 కాగా.. స్ట్రైక్ రేట్ 200 కావడం విశేషం.

ఈ క్రమంలో అభిషేక్ తన టీమ్‌‌ మేట్స్ సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) హయ్యెస్ట్ రేటింగ్ పాయింట్లను కూడా అధిగమించి తన ర్యాంక్ ను బలోపేతం చేసుకున్నాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. 5 మ్యాచ్య్ ల టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు  జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.