
కంటెంట్ ఉంటే చాలు నటీనటులతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇటీవల వచ్చిన అనేక సినిమాల విజయపరంపర దీనికి అద్దం పడుతోంది. తక్కువ బడ్జెట్ తో వచ్చినా.. కంటెంట్ ఉంటే చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రేక్షకులు . ప్రస్తుతం మారిన ట్రెండ్ లో సినిమాలతో పాటు ఓటీటీలో వస్తున్న వెబ్ సిరీస్ లు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. లేటెస్ట్ గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్, సినిమా రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన 'కథా సుధ'లో భాగంగా.. ఒక విభిన్నమైన ఆంథాలజీ సిరీస్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. అదే '4 టేల్స్' – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్.
సస్పెన్స్ థ్రిల్లర్ 'ది మాస్క్'
'4 టేల్స్' ఆంథాలజీ సిరీస్‌లోని మొట్టమొదటి కథ అయిన 'ది మాస్క్' ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ట్రైలర్‌ను దిగ్గజ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్,ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ వంటి ప్రముఖులు లాంచ్ చేయడం విశేషం. 'ది మాస్క్' కథాంశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని, అప్పుల పాలైన ఒక యువకుడు... ఆ అప్పు తీర్చడానికి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ అతను ఎలాంటి అనూహ్యమైన ఆపదలో చిక్కుకున్నాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్ర కథాంశం.
కొత్త కళ సూపర్ రెస్పాన్స్
ఈ చిన్న కథాంశంలోనే దర్శకుడు కొత్తపల్లి సురేష్ సస్పెన్స్, డ్రామా , డార్క్ హ్యూమర్ను సమపాళ్లలో మిళితం చేసి, బుల్లితెరపైనే ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించిన తీరు అద్భుతం అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో ఉన్న పట్టు, ఊహించని మలుపులు ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. 'నరుడి బ్రతుకు నటన' చిత్రానికి దర్శకత్వం వహించిన రిషికేశ్వర్ యోగి సమర్పణలో, కథా గని పిక్చర్స్ బ్యానర్ పై కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించి, నిర్మించిన 'ది మాస్క్' ఈ ఆదివారం అక్టోబర్ 12న ఈటీవీ విన్ రిలీజ్ అయింది.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో రావన్ నిట్టూరి, గడ్డం శ్రీనివాస్ నటించారు. అద్భుతమైన విజువల్స్ అక్షయ్ వసూరి అందించారు. విశాల్ భరద్వాజ్ అందించిన సంగీతం, పదునైన ఎడిటింగ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీల్‌ని కలిగిస్తోంది. ఎడిటింగ్‌ను రిషికేశ్వర్ యోగి నిర్వహించగా, సహ నిర్మాతలుగా బేబీ విరాన్ష, దీపికా అలోల , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ద్రువ్ చిత్రణ్ వ్యవహరించారు. '4 టేల్స్' సిరీస్‌లోని తదుపరి కథ కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.