భారీ సంఖ్యలో అమెజాన్ లే–ఆఫ్స్.. HRలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడినట్టే..!

భారీ సంఖ్యలో అమెజాన్ లే–ఆఫ్స్.. HRలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడినట్టే..!

అమెజాన్ కంపెనీ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఈసారి అమెజాన్ లే–ఆఫ్స్లో భాగంగా.. దాదాపు 15 శాతానికి పైగా HR ఉద్యోగులను తొలగించాలని డిసైడ్ అయిందని అమెరికన్ గ్లోబల్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ చెప్పుకొచ్చింది. అయితే.. ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోయాయనే నంబర్ విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. AIపై అమెజాన్ బిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తోంది. ఈ కారణంగా అమెజాన్ రానున్న రోజుల్లో చాలావరకూ ఉద్యోగాలను AIతో భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. 

ఈ ప్రభావం తాజాగా అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న వారి ఉద్యోగాలపై కూడా పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అమెజాన్ సంస్థ ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు 100 బిలియన్ డాలర్లకు పైగానే ఖర్చు చేసింది. ఏఐతో నూతన అధ్యాయం మొదలవుతుందని అమెజాన్ సీఈవో ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అమెజాన్ సీఈవోగా 2021లో ఆండీ జాసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారీగా లే–ఆఫ్స్ జరిగాయి. 2022 నుంచి 2023 మధ్య కాలంలో 27 వేల మంది ఉద్యోగులను అమెజాన్ ఇంటికి పంపించేసింది. అమెజాన్ లే–ఆఫ్స్ హిస్టరీలో ఇదే రికార్డ్. అప్పట్లో కరోనా కారణంగా అన్ని రంగాలు భారీగా నష్టపోయాయి. అమెజాన్తో పాటు చాలా సంస్థలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. కానీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ అమెజాన్ లే–ఆఫ్స్కు తెరలేపడం వ్యూహాత్మక ఎత్తుగడనేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలంలో పూర్తిగా AI వైపునకు అడుగులు వేయాలనే వ్యూహంలో భాగంగానే అమెజాన్ తాజా లే–ఆఫ్స్కు ప్లాన్  చేసిందని నిపుణులు భావిస్తున్నారు.