తెలంగాణ ఉద్యమ రీతిలో.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం సాగాలె!

తెలంగాణ ఉద్యమ రీతిలో.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం సాగాలె!

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరగాలంటే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా సాధించవచ్చు?  ఏ ఆర్టికల్ ద్వారా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టవచ్చు? అనే చర్చ విపరీతంగా చేసేవారు. ఆర్టికల్ 3 గురించి బాగా చర్చించేవారు.  ఇప్పుడు  తెలంగాణ ప్రాంతంలో మళ్లీ భారత రాజ్యాంగంలోని  షెడ్యూల్ 9 గురించి కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది.

 తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కేటాయిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన అనంతరం కూడా ఆ రిజర్వేషన్లు అమలుకు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉన్నాయని,   ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 కోర్టుల ముందు చెల్లుబాటు కాదనే వాదన జరుగుతోంది.  కొన్ని రోజుల క్రితం హైకోర్టు దానికి ఊతం కల్పిస్తూ తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల జీవోకు స్టే ఇవ్వడం జరిగింది. 

తమిళనాడు రిజర్వేషన్లకు షెడ్యూల్ 9 ఎలా  రక్షణ కలిపించింది? అన్న  విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాం. తెలంగాణలో తీసుకొచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రక్షణ కల్పిస్తూ పార్లమెంటులో  చట్టం చేయాలని కోరుతూ  పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వేషన్ల విషయంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీల  రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ ద్వారా చట్టబద్ధత కల్పించినప్పటికీ, బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగించడం జరిగింది.

 కానీ, దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఉంది అంటూ,  సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి ఉంది అంటూ జరుగుతున్న చర్చ సందర్భంలో..  తెలంగాణలో ప్రభుత్వం  తీసుకువచ్చిన  బీసీ బిల్లు రక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో చట్టం చేసి షెడ్యూల్ 9లో చేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే! 

నెహ్రూ ప్రభుత్వం ఆధ్వర్యంలో...

ఆర్టికల్ 31బీ అర్థం 9వ షెడ్యూల్‌‌‌‌లో  చేర్చిన ఏ చట్టమూ రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధమని చెప్పి రద్దు చేయరాదు. అనగా ఈ చట్టాలు ఒకవేళ  ‘ఫండమెంటల్ రైట్స్’కు వ్యతిరేకంగా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతాయి. 

1950–51 సంవత్సర కాలంలో భారత దేశంలో భూ సంస్కరణలు  ప్రారంభమయ్యాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థ రద్దు, భూముల పునర్విన్యాసం వంటి చట్టాలు తీసుకొచ్చాయి. ఆ సందర్భంలో భూస్వాములు ఈ చట్టాలు  భారత రాజ్యాంగ  పౌరుని  ప్రాథమిక హక్కులకు భంగం అని కోర్టులో సవాలు చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని చట్టాలను రద్దు చేసింది. 

అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఈ చట్టాలను రక్షించడానికి 9వ షెడ్యూల్‌‌‌‌ను ప్రవేశపెట్టింది. మొదట భూసంస్కరణలకు సంబంధించిన 13 చట్టాలను చేర్చారు. ఆ తరువాత ప్రతి రాజ్యాంగ సవరణలో కొత్త చట్టాలు చేర్చుతూ వచ్చారు.  ప్రస్తుతం 9వ షెడ్యూల్‌‌‌‌లో  ప్రధానంగా భూ సంస్కరణలు, పరిశ్రమల జాతీయీకరణ, విద్యా రిజర్వేషన్లు, ఇతర సామాజిక న్యాయం కార్యక్రమాలు, దేశరక్షణ, భారత-–బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం, తమిళనాడు రిజర్వేషన్ లాంటి చట్టాలను ఇప్పటివరకు 284కి పైగా చట్టాలు 9వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చడం జరిగింది. 

 కాలక్రమేణా సుప్రీంకోర్టు 9వ షెడ్యూల్ చట్టాలను కూడా పరిశీలించడం ప్రారంభించింది. కేశవానంద భారతి కేసు (1973) ద్వారా  పార్లమెంట్ సవరణాధికారానికి పరిమితులు విధించింది. బేసిక్​ స్ట్రక్చర్ సిద్ధాంతం ప్రకటించింది. అంటే 9వ షెడ్యూల్‌‌‌‌లో చేర్చిన చట్టాలు కూడా  ‘మూల నిర్మాణం’ ధ్వంసం చేస్తే  రద్దు చేయవచ్చని సూచించింది. 

రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం

బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా  అన్ని పార్టీలు అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు పలికి ఏకగ్రీవ తీర్మానం చేశారు.  అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న  బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చింది. కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఈ బిల్లును పార్లమెంటులో  ప్రవేశపెట్టడానికి నిరాకరిస్తోంది . ఏ పార్టీకి అయినా దేశవ్యాప్తంగా ఒకే రాజకీయ విధానం  ఉంటుంది. మరి బీజేపీ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో  కాకుండా ద్వంద్వ  వైఖరి పాటిస్తోంది. 

మొత్తంగా ప్రజల ఒత్తిడి మేరకో తమ రాజకీయ అవసరాల కోసమో కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి అమలు ప్రయత్నిస్తున్నప్పటికీ నేడు చట్టసభల్లో రక్షణ కల్పించే బాధ్యత మాత్రం ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న  బీజేపీపై ఉన్నది.  

తెలంగాణలోని సామాజిక న్యాయం కోరే శక్తులన్నీ ఇప్పుడు మళ్లీ ఒకే వేదికపైకి వచ్చి ఈ రిజర్వేషన్ల రక్షణ కోసం  కేంద్రంపై పోరాటాన్ని  తీవ్రం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న 42 శాతం రిజర్వేషన్ల చర్చను కేవలం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేయకుండా, విద్య,  ఉద్యోగ అవకాశాలకు విస్తరిస్తూ చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు సాధించే  పోరాటంగా మలచాల్సిన అవసరం ఉంది.

9వ షెడ్యూల్ నేపథ్యం

భారత రాజ్యాంగం కల్పించిన విస్తృత అధికారాలతో ఉన్నత న్యాయస్థానం ప్రతి అంశంపై జ్యుడీషియల్ రివ్యూ చేసే అవకాశం ఉంది.  కానీ,  దాన్ని వ్యతిరేకించే శక్తులు ఉన్నత  న్యాయస్థానాల్లోకి వెళ్లి ఆటంకాలు కలిగిస్తున్నాయి.    ఈ సందర్భంలో మరీ ప్రత్యేకంగా భూసంస్కరణలు అమలు అంశం చర్చకు వచ్చిన సందర్భంలో  మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేక జాబితా తొమ్మిదవ షెడ్యూల్ ను రూపొందించడం జరిగింది  .

 దీంట్లో కొన్ని చట్టాలను చేర్చి వాటిని న్యాయ పరిశీలన నుంచి రక్షించడానికి ఉపయోగించారు.  అంటే ఒక చట్టాన్ని 9వ షెడ్యూల్‌‌‌‌లో చేరిస్తే,  ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు  రాజ్యాంగ వ్యతిరేకమని రద్దు చేయకుండా రక్షణ  కల్పిస్తాయి. ఈ 9 షెడ్యూల్ మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా సృష్టించి 14 మే 1951న అమల్లోకి వచ్చింది.

- ధర్మార్జున్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  తెలంగాణ జన సమితి–