హైదరాబాద్-బెంగళూరు హైవే.. నిత్యం రద్దీగా ఉండే రోడ్డు. ఆరాంఘర్ లో అతిపెద్ద జంక్షన్. ఫుట్ పాత్ లను ఆక్రమించి యధేచ్ఛగా షాపులు నిర్మించుకున్నారు కొందరు వ్యాపారులు. దీంతో ప్రయాణికులతో పాటు ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది.
స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం (నవంబర్ 22) అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా, పిల్లర్ నెంబర్ 294 వద్ద ఫుట్ పాత్ ఫుట్ పాత్ రోడ్డు ఆక్రమణలపై భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు వద్ద కూల్చివేతలు చేపట్టారు.
ఆక్రమణలను తొలగిస్తుండగా కొందరు వీధి వ్యాపారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటన స్థలంలోనే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
