రెండు నెలల్లో లక్ష మంది..వెయ్యికి పైగా డెంగీ కేసులు..2 వేల మందికి టైఫాయిడ్

 రెండు నెలల్లో లక్ష మంది..వెయ్యికి పైగా డెంగీ కేసులు..2 వేల మందికి టైఫాయిడ్

హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వాతావరణ మార్పులతో జనం రోగాల బారినపడుతున్నారు. పోయిన నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు టైఫాయిడ్, డెంగీ, మలేరియా లక్షణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 1.02 లక్షల మంది ప్రభుత్వ దవాఖాన్లలో చేరారు. ఇక ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్‌‌మెంట్ పొందినోళ్ల సంఖ్య మరో 2 లక్షలకు పైనే ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. వారం సంది గెరువియ్యకుండా వర్షాలు కురుస్తుండడం, చల్లటి వాతావరణం, వరదలు, నీటి కాలుష్యం తదితర కారణాలతో జ్వరాలు వస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని రోజుల వరకు బయటి ఫుడ్‌‌ను తినడం మానేసి, ఇంట్లోనే ఫ్రెష్‌‌గా వండుకుని తినాలని సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. 

హైదరాబాద్‌‌లోనే డెంగీ కేసులెక్కువ..  

పోయినేడాది రాష్ట్రంలో 9,625 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈసారి అంతకంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డెంగీ లక్షణాలతో గడిచిన 50 రోజుల్లో 10 వేల మంది దవాఖాన్లలో అడ్మిట్ కాగా.. 1,008 మందికి డెంగీ ఉన్నట్టు టెస్టుల్లో తేలింది. ఇందులో అత్యధికంగా 813 కేసులు హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఊర్లలో కంటే సిటీలో ఎక్కువ కేసులు రావడం ఇదేం తొలిసారి కాదు. కొత్తగూడెం, ములుగు వంటి అటవీ ప్రాంత జిల్లాల కంటే.. ఏటా సిటీలోనే జ్వరాల కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ బస్తీల్లో శానిటేషన్ సరిగా లేకపోవడం, దోమల నివారణ చర్యలపై జీహెచ్‌‌ఎంసీ దృష్టి పెట్టకపోవడమే ఇందుకు కారణమని ఆరోగ్యశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశాఖ, మున్సిపల్ ఆఫీసర్లు గతంలోనూ ఈ అంశంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. 

అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నం: మంత్రి హరీశ్ రావు 

ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఆదివారం పది నిమిషాలు ఇంటి పరిసరాల్లో దోమల నివారణకు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని తన నివాసంలో దోమల నివారణ కోసం కాసేపు పని చేశారు. కుండీలు, ఇతర ప్రదేశాల్లో నిలువ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీళ్లు నిల్వ ఉన్నా దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. వాటి వల్ల డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తాయన్నారు. వాటికి దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘వర్షాకాలం కాబట్టి మేం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నం.  ప్రభుత్వ దవాఖాన్లలో, టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నం. మందులతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు ప్రభుత్వ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయి. అనారోగ్యానికి గురైతే ప్రభుత్వ దవాఖాన్లకే వెళ్లాలి” అని సూచించారు.