కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీళ్ల పంచాది.. బనకచర్ల vs కాళేశ్వరం

కాంగ్రెస్  బీఆర్ఎస్ మధ్య  నీళ్ల పంచాది.. బనకచర్ల  vs కాళేశ్వరం
  • కాళేశ్వరం నీళ్లు ఇడువాలన్న బీఆర్ఎస్  
  •  కన్నెపల్లికి కదనయాత్ర చేస్తామన్న హరీశ్
  • రేపు సీడబ్ల్యూసీ నివేదిక బయటపెడ్తానన్న ఉత్తమ్
  • ప్రజాభవన్ వేదికగా పవర్ పాయింట్  ప్రజెంటేషన్
  • బనకచర్లకు కేసీఆర్ ప్రభుత్వమే ఓకే  చెప్పిందన్న మంత్రి పొంగులేటి
  • నీళ్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు  నీళ్ల  చుట్టూ తిరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి నీళ్ల పంచాది నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్  ను కలువనున్నారు. ఇందుకోసం అపాయింట్ మెంట్ సైతం తీసుకున్నారు. బనకచర్లకు కేసీఆర్ ప్రభుత్వమే ఓకే చెప్పిందంటూ మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి  సంచలన ప్రకటన చేశారు. 

గత ప్రభుత్వం పక్క రాష్ట్రంతో లాలూచీపడి కృష్ణ పరివాహక ప్రాంత రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వ్యాఖ్యనించారు. ఒక్క  నీటి చుక్కను కూడా వదులుకోబోమని, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంపులు స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. మేడిగడ్డతో  సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ లను ఆన్ చేస్తే రెండు టీఎంసీలు వాడుకునేందుకు వీలుంటుందని చెబుతోంది. వారం రోజుల్లో ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకపోతే  మేమే కన్నెపల్లి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాం. 

►ALSO READ | Srisailam: నిండు కుండలా శ్రీశైలం ప్రాజెక్ట్.. ఎగువ నుంచి భారీ వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడంటే..

కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. కాళేశ్వరం పై నేషనల్ డ్యాం సెక్యూరిటీ అథారిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది..? అందులో ఏముందో చెప్పేందుకు ఏకంగా పవర్ పాయింట్  ప్రజెంటేషన్ కే రెడీ అయ్యారు. ప్రస్తుత కాళేశ్వరం పరిస్థితిని చూపించేందుకూ సిద్ధమయ్యారు. కృష్ణ జలాల దోపిడీకి అవకాశం ఇచ్చిందెవరు..? ఎవరు.. ఎప్పుడు సంతకం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిందెవరు..? అన్నది తేల్చేస్తానంటున్నారు. దీంతో రాష్ట్రంలో వాటర్ హీట్ కొనసాగుతోంది.