IND VS ENG 2025: మాటతో కాదు ఆటతోనే సమాధానమిచ్చాడు.. గిల్ దెబ్బకు ఇంగ్లాండ్ జర్నలిస్ట్ మాయం

IND VS ENG 2025: మాటతో కాదు ఆటతోనే సమాధానమిచ్చాడు.. గిల్ దెబ్బకు ఇంగ్లాండ్ జర్నలిస్ట్ మాయం

ఎడ్జ్ బాస్టన్ విజయం టీమిండియాలో జోష్ నింపింది. తొలి టెస్టులో ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన గిల్ సేన విజయంపై మ్యాచ్ కు ముందు వరకు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందులో కూడా ఎడ్జ్ బాస్టన్ లో రికార్డ్స్ టీమిండియాకు ఘోరంగా ఉన్నాయి. 8 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ ల్లో ఓడిపోయి.. ఒక మ్యాచ్ డ్రా తో సరిపెట్టుకుంది. దీంతో మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ జట్టు క్లియర్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ టీమిండియా ఏకంగా 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి ఇంగ్లాండ్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 

రెండో టెస్టుకు ముందు గిల్ ను ఇంగ్లాండ్ జర్నలిస్ట్ తన ప్రశ్నతో ఓవరాక్షన్ చేశాడు. "ఇప్పటివరకు ఇండియా ఎడ్జ్ బాస్టన్ లో గెలవలేదు. మీ జట్టు గెలవగలదని మీరు అనుకుంటున్నారా.." అని అడిగాడు. విజయం తర్వాత గిల్ తన చమత్కారంతో జర్నలిస్ట్ పై సెటైర్ వేశాడు. గిల్ మాట్లాడుతూ.. " నా అభిమాన జర్నలిస్ట్ నాకు కనిపించడం లేదు. అతడిని నేను చూడాలేమో.." అని అన్నాడు. గిల్ మ్యాచ్ కు ముందు ఎలాంటి అసహనానికి గురవ్వలేదు. గెలిచిన తర్వాతే తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.     

"నేను గణాంకాలను లేదా చరిత్రను నమ్మను అని చెప్పాను. 50-60 సంవత్సరాల చరిత్రలో మేము 7 మ్యాచ్ లను (ఎడ్జ్ బాస్టన్ లో) వేర్వేరు కోర్సుల్లో ఆడాము. వేర్వేరు జట్లు ఇక్కడకు వచ్చాయి. ఇంగ్లాండ్ కు ఇక్కడికి వచ్చిన అత్యుత్తమ భారత జట్టు ఇదేనని నేను నమ్ముతున్నాను. వారిని ఓడించి ఇక్కడి నుండి సిరీస్ గెలవగల సామర్థ్యం మాకు ఉంది. మనం సరైన నిర్ణయాలు తీసుకుంటూ, పోరాడుతూ ఉంటే, ఈ సిరీస్ గుర్తుంచుకోవలసిన సిరీస్ లలో ఒకటి అవుతుందని నేను భావిస్తున్నాను". అని గిల్ మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్ అత్యద్భుత బ్యాటింగ్‌‌కు తోడు ఆకాశ్ దీప్ (10/187) రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి పది వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో విజృంభించడంతో ఐదో రోజు, ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 336 రన్స్‌‌ తేడాతో ఇంగ్లండ్‌‌పై అఖండ విజయం అందుకుంది. ఇండియా ఇచ్చిన 608 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌లో ఓవర్‌‌‌‌నైట్ స్కోరు 72/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ 68.1  ఓవర్లలో 271 కే కుప్పకూలి చిత్తుగా ఓడింది.  దాంతో ఇండియా ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 1–1తో సమం చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 587 పరుగులు చేస్తే.. బదులుగా ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి టీమిండియా  427 వద్ద డిక్లేర్ చేసింది. 608 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 430 పరుగులు చేసిన గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.