ప్రపంచం ముందు పాక్ పరువు తీశావ్: బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు ఫైర్

ప్రపంచం ముందు పాక్ పరువు తీశావ్: బిలావల్ భుట్టో వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కొడుకు ఫైర్

ఇస్లామాబాద్: హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ ఫైర్ అయ్యాడు. బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ప్రపంచం ముందు పాకిస్తాన్‌ పరువు తీశాయని విమర్శించాడు. బిలావల్ భుట్టో ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సిందని కాదని తప్పుబట్టాడు. హఫీజ్ సయీద్‌ను భారతదేశానికి అప్పగించడానికి పాక్ సిద్ధంగా ఉందన్న భుట్టో వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. 

అసలేం జరిగిందంటే..? 

శుక్రవారం (జూలై 4) అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. భారత్ ఆందోళన వ్యక్తం చేసే లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) అధినేత హఫీజ్ సయీద్,  జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను ఇండియాకు అప్పగించడానికి పాకిస్థాన్‎కు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే వాళ్లకు వ్యతిరేకంగా భారత్ సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది. 

ఈ ప్రక్రియలో భారత్ సహకరిస్తే వాళ్లను ఆ దేశానికి అప్పగించడంలో పాక్‎కు ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ఇది పాక్, భారత్ మధ్య విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా బిలావల్ అభివర్ణించారు. కరుడుగట్టిన ఉగ్రవాదులు మసూద్ అజార్, హఫీజ్ సయీద్‎ను యూఎన్‎వో, భారత్ టెర్రరిస్టులుగా గుర్తించిన.. వీరిద్దరి ఇంకా పాకిస్థాన్‎లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని భారత్ పదే పదే వాదిస్తోంది. 

భారత్ వ్యాఖ్యలకు స్పందనగా బిలావల్ భుట్టో పై వ్యాఖ్యలు చేశాడు. హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పగించడానికి పాకిస్థాన్ సిద్ధమన్న భుట్టో వ్యాఖ్యలను పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ కూడా తీవ్రంగా విమర్శించారు. బిలావల్ భుట్టోను పరిపక్వత లేని రాజకీయ నాయకుడని విమర్శించింది. బిలావల్ వ్యాఖ్యలు పాకిస్తాన్ జాతీయ భద్రతాను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచ వేదికలపై దేశాన్ని ఇరకాటంలో పడేశాయన్నారు.