మహేష్ బాబుకు లీగల్ కష్టాలు: బ్రాండ్ అంబాసిడర్‌ పాత్రలపై డైలమా.. వాట్ నెక్ట్స్..?

మహేష్ బాబుకు లీగల్ కష్టాలు:  బ్రాండ్ అంబాసిడర్‌ పాత్రలపై డైలమా..  వాట్ నెక్ట్స్..?

సినిమా సెలబ్రిటీలు, వారి స్టార్‌డమ్.. ఇది కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే పరిమితం కాదు. సమాజంపై, ముఖ్యంగా యువతపై వారి ప్రభావం అపారం. కొన్నిసార్లు ఈ ప్రభావం సానుకూలంగా ఉంటే, మరికొన్నిసార్లు అది ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు వంటి అగ్ర నటుడికి ఎదురైన తాజా వివాదం, ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఇప్పుడు ఆయన లీగల్‌గా చిక్కుల్లో పడ్డారు.  

సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులు లేదా సేవలు, ఎంతగానో నమ్మదగినవిగా కనిపిస్తాయి. "అంత పెద్ద సెలబ్రిటీ చెప్పాడు కదా, నిజమే అయ్యుంటుంది" అనే భావనతో చాలా మంది ప్రజలు, ముఖ్యంగా తక్కువ అవగాహన ఉన్నవారు, వాటిని గుడ్డిగా నమ్ముతారు. సాయి సూర్య డెవలపర్స్ వంటి కేసుల్లో, సెలబ్రిటీల ప్రచారం మోసగాళ్లకు అడ్డంకిగా మారి, అమాయక ప్రజలను బలి పశువులను చేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. వివరాల్లోకి వెళితే.. 

డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. 
 హైదరాబాద్‌కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు గాను, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నుంచి మహాష్ బాబుకు లీగల్ నోటీసులు అందాయి.   ఒక భారీ మోసపూరిత కేసులో మహేష్ పేరు తెరపైకి రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో, ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.   ఈ వ్యవహారం మొత్తం ఒక డాక్టర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ ప్రచారం చేసిన లేఅవుట్‌లో తాను ప్లాట్లు కొనుగోలు చేసి, అవి వాస్తవానికి లేవని, ఈ క్రమంలో రూ. 34.8 లక్షలు మోసపోయానని సదరు డాక్టర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. "మహేష్ బాబు వంటి అగ్ర నటుడు ఈ ప్రాజెక్ట్‌ను ప్రచారం చేయడంతోనే అది నమ్మదగినదిగా కనిపించింది. ఆయన ప్రకటనలు చూసే మేము ధైర్యం చేసి పెట్టుబడి పెట్టాము" అని ఆమె వినియోగదారుల కమిషన్‌కు తెలిపారు. ఈ కేసులో మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చింది..

ALSO READ : 'క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ' సీజన్ 2: తులసిగా స్మృతి ఇరానీ రీఎంట్రీ!

గతంలోనూ ED నోటీసులు.. 
వాస్తవానికి, సాయి సూర్య డెవలపర్స్ పేరుతో మహేష్ బాబుకు సంబంధం ఉండటం ఇదే మొదటిసారి కాదు.  గతంలో, అంటే 2025 ఏప్రిల్‌లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మహేష్ బాబును ప్రశ్నించింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ విచారణ జరిగింది. ED వర్గాల ప్రకారం, మహేష్ బాబు ఈ సంస్థలు ప్రారంభించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల ప్రచార ప్రకటనలలో పాల్గొన్నారు. ఈ ప్రచారాలకు గాను మహేష్ బాబుకు మొత్తం రూ. 5.9 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో రూ. 3.4 కోట్లు చెక్కు రూపంలో, మిగిలిన రూ. 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించబడినట్లు ED గుర్తించింది. నగదు రూపంలో జరిగిన ఈ లావాదేవీపైనే ED తీవ్ర అనుమానం వ్యక్తం చేసింది. ఈ నగదు చెల్లింపు విస్తృత మనీలాండరింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించినది కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు, అందుకే నటుడిని ప్రశ్నించడానికి సమన్లు జారీ చేశారు. ఏప్రిల్ 28న ED ముందు హాజరు కావాలని మహేష్ బాబుకు సూచించారు.

అభిమానుల్లో ఉత్కంఠ

అయితే, ED విచారణలో మహేష్ బాబును నిందితుడిగా పరిగణించలేదని, ఆయన మంచి నమ్మకంతోనే ప్రాజెక్ట్‌ను ఆమోదించి ఉండవచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుత వినియోగదారుల కమిషన్ నోటీసు, బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ బాబు పాత్రను మరోసారి తీవ్ర పరిశీలనకు గురిచేస్తోంది. . వినియోగదారుల కమిషన్ మహేష్ బాబుతో పాటు, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ, దాని యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తాను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేశారు. ఈ కీలక పరిణామాలపై మహేష్ బాబు కానీ  ఆయన బృందం ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారి మౌనం మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 

ఒకవైపు ED విచారణలు, మరోవైపు వినియోగదారుల కమిషన్ నోటీసులు... ఈ పరిణామాలు మహేష్‌బాబు కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని సినీ పరిశ్రమ వర్గాలు, ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒక బ్రాండ్‌కు ముఖంగా నిలబడే సెలబ్రిటీలు ఆ బ్రాండ్ నేపథ్యాన్ని, దాని విశ్వసనీయతను ఎంత లోతుగా పరిశీలించాలనే చర్చకు ఈ కేసు కొత్త ఊపిరి పోసింది. ఈ కేసులో మహేష్ బాబు తదుపరి అడుగులు ఎలా ఉంటాయి? ఆయన ఈ ఆరోపణల నుంచి ఎలా బయటపడతారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాల కోసం వేచి చూడాలి.