
బ్రిటన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. అతిథ్య ఇంగ్లాండ్ జట్టును 336 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టీమిండియా యంగ్ బౌలర్ ఆకాష్ దీప్ 10 వికెట్లతో చెలరేగి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ ఇన్సింగ్స్‌లో నాలుగు, సెకండ్ ఇన్సింగ్స్‌లో ఆరు.. రెండు ఇన్సింగ్స్‌లో కలిపి మొత్తం 10 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. తద్వారా ఆకాష్ దీప్ అరుదైన ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ గడ్డపై 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతకముందు ఈ రికార్డ్ చేతన్ శర్మ పేరిట ఉండేది. 1982లో బర్మింగ్ హామ్లో జరిగిన టెస్టులోనే రెండు ఇన్సింగ్సుల్లో కలిపి చేతన్ శర్మ 10 వికెట్లు తీశాడు. తాజాగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన టెస్టులోనే 10 వికెట్లు పడగొట్టి 29 ఏళ్ల తర్వాత చేతన్ శర్మ రికార్డును సమం చేశాడు ఆకాష్ దీప్.
ఇదే కాకుండా.. బర్మింగ్‌హామ్ టెస్ట్ విజయంతో టీమిండియా పలు రికార్డులు సాధించింది. పరుగుల (336) పరంగా విదేశాల్లో భారత్‌కు ఇదే పెద్ద టెస్ట్ విజయం. అలాగే, బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో కూడా టీమిండియాకు ఇదే తొలి టెస్ట్ విజయం. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమన్ గిల్‌కు ఇదే ఫస్ట్ టెస్ట్ విజయం. అలాగే, భారత్-ఇంగ్లాండ్ మధ్య అత్యధిక (1692) పరుగులు నమోదైన మ్యాచుగా రికార్డ్.