
హైదరాబాద్: వీసా గడువు అయిపోయినా అక్రమంగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఇద్దరు నైజీరియన్స్.. ఒకరు టాంజానియా.. ఒకరు సూడానియన్ చెందిన వారు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇందులో ఇద్దరు మహిళలు.. ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరు డ్రగ్స్ మూలాలు ఉన్నవారితో తిరుగుతున్నారన్న సమాచారంతో నిఘా పెట్టి పట్టుకున్నామని, వీరిపై కేసు పెట్టకుండా వారి స్వదేశాలకు పంపిస్తున్నామని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సురేంద్ర ప్రెస్ మీట్లో తెలిపారు. ఇటీవల.. ఇలా హైదరాబాద్ నగరంలో విదేశీయులు అక్రమంగా ఉంటున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగు చూస్తుండటం గమనార్హం.
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇద్దరు బంగ్లాదేశీయులను కూడా ఇటీవల అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ హసీబుల్ నాలుగేళ్ల క్రితం అక్కడి బెనపోల్ జిల్లా నుంచి ట్రాఫికర్లకు రూ.25 వేలు చెల్లించి, పశ్చిమబెంగాల్‌లోని బొంగావ్ జిల్లా మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. కోల్‌కతాలో కరాటే శిక్షకుడిగా పని చేసిన ఇతడు జోవాన్ చౌదరి పేరిట నకిలీ ఆధార్ కార్డు సంపాదించాడు. 2023 డిసెంబర్‌లో ఫేస్‌బుక్ ద్వారా మలక్‌పేట్‌కు చెందిన జయ చౌదరికి పరిచయమై, ఆమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇక్కడ జొమాటో, స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేశాడు.
ALSO READ : క్రీడా అభివృద్ధికి నిధులివ్వండి..కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్
స్థానిక ఏజెంట్లు మహహ్మద్ ముఖీద్, సాయి కిరణ్, రాజనీకాంత్ సహాయంతో నార్సింగి మున్సిపాలిటీ నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్ సంపాదించాడు. దీన్ని మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే సుధీర్ కుమార్ ఇచ్చాడు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా హసీబుల్ ఓటర్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. తర్వాత తన స్నేహితుడు రోహన్ సాహా, అతని భార్యను ఈ ఏడాది మార్చిలో మలక్‌పేట్‌కు తీసుకొచ్చి, అతనికి కూడా నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురినీ అరెస్ట్ చేసి, నకిలీ ఆధార్ కార్డులు, బర్త్సర్టిఫికెట్లు, ఓటర్ కార్డు, 7 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని, మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.