మంచం పట్టిన ‘తెనుగుపల్లె’

మంచం పట్టిన ‘తెనుగుపల్లె’
  • ఇంట్లో ఇద్దరు ముగ్గురికి జ్వరాలు
  • డెంగీతో 100 మందికిపైగా ప్రైవేటులో ఆస్పత్రుల్లో చేరిక
  • డబ్బులు కట్టలేక అప్పుల పాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసులు కలవరపెడుతున్నాయి. జిల్లాలోని మానకొండూరు మండలం గంగిపల్లిలోని తెనుగుపల్లెలో వారం పది రోజుల నుంచి జ్వరం బాధితుల సంఖ్య పెరుగుతోంది. తెనుగుపల్లెలోని 6, 7 వార్డుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో మొత్తం మొత్తం 200 వరకు ఇండ్లు ఉండగా, 800కి పైగా జనాభా ఉంది.  ఈ  ఏరియాలో ఇంటికి కనీసం ఇద్దరి చొప్పున 400 మంది  జ్వరాల బారిన పడ్డారు. డెంగీ పాజిటివ్​తో ఇప్పటికే 100 మందికి పైగా బాధితులు ప్రైవేటు హాస్పిటళ్లలో, మరో 100 మంది ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. అధికారులు మాత్రం గ్రామంలో మూడే కేసులు ఉన్నాయంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డెంగీ జ్వరాలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య శాఖ అధికారులు కేసుల గురించి ఆరా తీయడం లేదు.
  
రూ. లక్షల్లో ఖర్చు..
డెంగీ జ్వరాలతో బాధితులంతా ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు బాట పడుతున్నారు. కొందరు బాధితులు ఐసీయూలో నాలుగైదు రోజులు ఉన్న వారు కూడా ఉన్నారు. ఇంటికి చేరుకునే సరికి రూ.70 వేల నుంచి రూ.80వేలు ఖర్చు అవుతున్నాయని బాధితులు చెబుతున్నారు.

పట్టించుకోని హెల్త్ సిబ్బంది..
గ్రామంలో జ్వరాలతో బాధపడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏమీ పట్టనట్లుగా ఉంటున్నారని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న ఆశ, ఏఎన్ఎంలు జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులు చేయించడం, సమస్య తీవ్రంగా ఉంటే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేయడం లాంటివి చేయాలి. కానీ ఇవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. చాలా మందికి జ్వరాలు వచ్చిన తరవాత మురుగునీటి కాలువల్లో బ్లీచింగ్, ఫాగింగ్, డ్రైడే లు నిర్వహించారు. 

ఒక్కనికే రూ.80వేలు అయినయ్..
మా ఇంట్లో మా నాయినకు, నా కొడుకుకు, నాకు ముగ్గురికీ జ్వరాలే. డెంగీ అంటే భయపడి కరీంనగర్ ప్రైవేటు హాస్పిటల్ కు  పోయినం. నాకు ఒక్కనికే రూ.80వేలు అయినయ్. మా నాయిన ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నడు. గవర్నమెంట్ తరఫున వచ్చి చెప్పితే బాగుండు. పైసలు కట్టలేక అప్పుల పాలైతిమి.  
- ఆకుల మొగిలి

మూడే కేసులు..
గంగిపల్లిలో జ్వరాలు వస్తున్నాయనే సంగతి తెలుసుకుని మా సిబ్బందితో క్యాంపులు పెడుతున్నం. ఇక్కడ డెంగీ కేసులు మూడే వచ్చాయి. సివిల్ హాస్పిటల్ లో జాయిన్ చేయించి ట్రీట్ మెంట్ అందించాం. మా సిబ్బంది రోజురోజు పరిశీలిస్తున్నారు. ప్రైవేట్​కు వెళ్తున్నట్లు సమాచారం అందలేదు.
- డాక్టర్ జువేరియా, డీఎంహెచ్, కరీంనగర్

రెండున్నర లక్షలు అయినయ్..
మా ఇంట్లో నాకు, మా ఆయనకు, కొడుకుకు డెంగీ జ్వరాలు వచ్చినయ్. రెండు రోజులు ఇంటి దగ్గరనే ఉన్నం. కాని తక్కువ కాలే. ముగ్గురం కరీంనగర్​లోని ప్రైవేటు హాస్పిటల్​లో చేరినం. రక్తకణాలు తక్కువ అయినయ్ అని డాక్టర్లు చెప్పిండ్రు. రెండున్నర లక్షలు అయినన్. అప్పులు తెచ్చికట్టినం.
- భూమ సునంద, గంగిపల్లి 

‘‘తెనుగుపల్లెకు చెందిన కొలిపాక సంపత్ కుటుంబం ఇది. సంపత్​తోపాటు ఆయన భార్య సరవ్వ, కొడుకు మహేశ్​కు డెంగీ లక్షణాలు ఉండటంతో కరీంనగర్​లోని ప్రైవేటు హాస్పిటల్​లో చేరారు. వీరికి చూసుకునేందుకు సంపత్ ​కూతురు రమ్య అక్కడే ఉంది. ప్లేట్ లెట్స్ తగ్గుతుండటంతో ట్రీట్​మెంట్ కోసం ముగ్గురికి కలిపి సుమారుగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో గ్రామంలో తెలిసిన వారే అకౌంట్లలో డబ్బులు వేశారు.ట్రీట్ మెంట్ కోసం సరవ్వ తన మూడు తులాల బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టింది.’’